సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): విద్యుత్ సంస్థల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్, ఆర్టిజెన్ల పాత్ర ఎంతో కీలకమని, అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం పైస్థాయిలో ప్రభుత్వం, యాజమాన్యాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని అమలు చేయడం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిపైనే ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు.
బుధవారం జీటీఎస్కాలనీలో జెన్కో ఆడిటోరియంలో బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని మొత్తం సిబ్బందితో విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు ఒక సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులనుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. వేసవికాలంలో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి పలు రకాల చర్యలు చేపట్టామని సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పారు.
ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో సుల్తానియా మాట్లాడుతూ ఈ సీజన్లో విద్యుత్ డిమాండ్ 17162 మెగా వాట్లకు చేరిందని, డిమాండ్ ఇంతగా పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం వెనక క్షేత్రస్థాయి సిబ్బంది కృషి కారణమన్నారు.
ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి మాట్లాడుతూ వేసవి కాల సన్నద్ధతకు సంబంధించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు డా.నర్సింహులు, సాయిబాబా, నందకుమార్, సుధామాధురి, చీఫ్ ఇంజనీర్ చక్రపాణి, ఎస్ఈలు, డిఈలు, బంజారాహిల్స్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.