 
                                                            వెంగళరావునగర్, అక్టోబర్ 30: మోసపూరిత హామీలతో మహిళలను కాంగ్రెస్ సర్కార్ మోసగించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్ వికాస్ పురి కాలనీ,సిద్ధార్థ నగర్ కాలనీ, ఏజీ కాలనీల్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ వద్ద బీఆర్ఎస్ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.2,500లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని విస్మరించారని అన్నారు. చదువుకునే యువతులకు స్కూటీలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ గడ్డ పై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య స్కూటీ పై జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ కూర్చుని ప్రచారం నిర్వహించారు. కృష్ణకాంత్ పార్క్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మసీదు గడ్డ,రహ్మత్ నగర్,యాదగిరి నగర్,మధురానగర్, వెంగళరావునగర్, సిద్ధార్థ నగర్,జవహర్ నగర్ మీదుగా కళ్యాణ్ నగర్ క్రాస్ రోడ్డు వద్దకు చేరి ముగిసింది. దారి పొడవునా ఆమె పై అభిమానులు,ఓటర్లు పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు,ఎమ్మెల్సీ తాత మధు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రావు పాల్గొన్నారు.
 
                            