మేడ్చల్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అధికారులు అంచనా వేసినప్పటికీ కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది.
జిల్లాలో ఇప్పటికే వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. ధాన్యం మొదటి రకానికి రూ.3,229, రెండవ రకానికి రూ.2,300 ధరను ప్రభుత్వం నిర్ణయించింది.. అయితే సన్న బియ్యానికి రూ.500 బోనస్ అందిస్తామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గత సీజన్లోనే సన్న వడ్లకు బోనస్ అందించడం ఆలస్యం కావడంతో పాటు కొంతమంది రైతులకు బోనస్ అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాసంగి సీజన్లో సన్న వడ్లను విక్రయించిన రైతులకు బోనస్‌ను తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కోతకు రాకముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేదని డీసీఎంస్ వైస్ చైర్మన్మధుకర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా అధికారులు పకడ్బందీగా చేపట్టేవారు.. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలను కల్పించేవారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై తాత్సారం చేస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. లేకుంటే ఆందోళన కార్యాక్రమాలు చేపడతామని హెచ్చరించారు.