కంటోన్మెంట్, నవంబర్ 27: బీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థ్ది లాస్య నందిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే నిండా మునుగుడే అని, సీఎం కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఆరో వార్డులోని కాంటా బస్తీలో ఎన్నికల ప్రచారాన్ని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్‌తో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని పేర్కొన్నారు.
ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, రైతు పెట్టుబడి సాయం వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. కేసీఆర్ సారథ్యంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు రూ.3000, రేషన్‌కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా, గృహలక్ష్మి పథకం కింద అర్హులకు ఇండ్లు నిర్మించి అందజేస్తామని తెలిపారు. అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు దీననాథ్ యాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.