OTS | సిటీబ్యూరో: బల్దియా బాటలోనే జలమండలి నడుస్తున్నది. నెలవారీగా నీటి బిల్లులు, నల్లా కనెక్షన్లు, వాటర్ ట్యాంకర్ల రూపంలో రూ. 115 కోట్ల మేర వస్తుండగా… ఖర్చులు మాత్రం రెట్టింపు స్థాయిలో రూ. 234 కోట్ల మేర ఉంటున్నది. అంటే ..ప్రతి నెలా రూ .119 కోట్ల లోటుతో జలమండలి కొట్టుమిట్టాడుతున్నది. ముఖ్యంగా విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన కరెంట్ చార్జీలు రూ.3800 కోట్లు పెద్ద సవాల్‌గా మారింది. గడిచిన 10 నెలలుగా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా విడుదల కాలేదు…20 కేఎల్ ఉచిత వాటర్‌కు ప్రభుత్వం నుంచి రూ.715 కోట్ల మేర రావాల్సి ఉంది.
కాగా, జలమండలి సొంతంగా ఆదాయం పెంచుకునే మార్గాలు ఉన్నా..లోపాలను సరిదిద్దే సమర్థవంతమైన నాయకత్వం కొరవడింది. నల్లా కనెక్షన్ల (క్యాన్) సర్వే, గేటెడ్ కమ్యూనిటీ, ఇతర వ్యాపార సంస్థల నుంచి సీవరేజీ సెస్, డెవలప్మెంట్ చార్జీల సవరణ, ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాల్లో కొత్త నల్లా కనెక్షన్ల జారీ వంటి సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. అధికారులు మాత్రం ఇవేం పట్టకుండా నీటి చార్జీలు పెంచకపోవడం వల్లే భారం పెరుగుతున్నదని చెబుతుండటం గమనార్హం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.1660 కోట్లు, ప్రైవేట్, డొమెస్టిక్ వినియోగదారుల నుంచి సుమారు రూ. 300కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. దీంతో తెరపైకి ఓటీఎస్‌ను మళ్లీ తీసుకువచ్చి ఈ నెలాఖరు వరకు అమలు చేస్తున్నారు.
నీటి బిల్లు బకాయిదారులకు ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అవకాశాన్ని కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు చేసింది. 7.18 లక్షల కనెక్షన్లకు ఓటీఎస్ వర్తించనున్నది. వీటి నుంచి రూ. 1961 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉండగా, ఇందులో రూ.705 కోట్ల మేర వడ్డీ మాఫీ కానుంది. రూ. 1255 కోట్ల మేర బకాయిలు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
సుమారు 40 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. 1660 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వైద్య ఆరోగ్య రూ. 56.30 కోట్లు, హౌసింగ్ రూ.33 కోట్లు, ఇరిగేషన్ రూ. 21 కోట్లు , పంచాయతీ రాజ్ రూ. 37కోట్లు, మిషన్ భగీరథ రూ. 82 కోట్లు, పురపాలక రూ. 26 కోట్లు, సాధారణ పరిపాలన రూ. 12 కోట్లు, హోం రూ. 27 కోట్లు తదితర శాఖలు నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలకు జలమండలి లేఖలు రాయనున్నది.