కుత్బుల్లాపూర్, మార్చి 4: నువ్వింత నేనింత అన్న చందంగా ఒకరికి మించి మరొకరు ఎత్తుకుపై ఎత్తుగా పోటాపోటీ పడుతూ ఆ పార్కు స్థలాన్ని పూర్తిగా అన్యాక్రాంతం (Land Grabbing) చేస్తున్నారు. ఒకరిద్దరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుని పేరిట కోట్లు విలువ చేసే చెరువు బఫర్ జోన్లో ఉన్న పార్కు స్థలాన్ని మాయం చేస్తున్నారు. రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టి తెల్లారే సరికి అక్కడ దేవుడు వెలుస్తాడు. ఇదేమిటంటే అందరికీ తెలిసిందే కదా కబ్జాదారులు మీనా మీసాలు తిప్పుతున్నారు. ఇది అక్రమమని తెలిసి.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో ఆ పార్కుకు రక్షణ లేకుండా పోతుందని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి (Kompally) మున్సిపాలిటీ పరిధి ఊర చెరువు బఫర్ జోన్లో ఉన్న పార్క్‌లో నెలకొంటున్న దుస్థితి.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఊర చెరువు బఫర్ జోన్లో అపర్ణ ఫామ్ గ్రోమ్ వెంచర్‌కు సంబంధించిన మిగులు స్థలాన్ని పార్కుగా సూచించారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతోపాటు పర్యావరణాన్ని అందించే దిశగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పార్కును అభివృద్ధి చేసి అందులో మొక్కలు నాటి కేటీఆర్ పార్కుగా నామకరణం చేశారు. గతంలోనే ఈ పార్కుకు ఆనుకొని ఉన్న స్థలంలో కొన్ని ఆలయాలు వెలిశాయి. కాగా ఇదే అదునుగా భావించి మరి కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాత్రికి రాత్రి ఆలయాలను ఏర్పాటు చేసుకొని పార్కు స్థలాన్ని కబ్జా చేయడానికి పూనుకున్నారు. అయితే అప్పటి అధికారులు వాటిని కూల్చివేసిన సందర్భాలు ఉన్నాయి.
కాగా, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ పార్కుకు రక్షణ లేకుండా పోతుందని స్థానికులు అంటున్నారు. దానికి అనుకుని ఉన్న కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్‌లో ఉన్న ఒకరిద్దరు తమ వ్యక్తిగత శ్రేయస్సు కోసం పార్కు స్థలంలో ఇటీవల ఆలయ నిర్మాణ పనులకు పూనుకున్నారు. రాత్రికి రాత్రి ఆలయ నిర్మాణ పనులు చేపట్టి అక్కడి స్థలాన్ని మాయం చేసేందుకు పన్నాగం పన్నారు. పార్కు స్థలాన్ని రక్షించాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విచారకరమని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఉండే పార్కు స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అలాంటి స్థలాలను మాయం చేయడం గమనార్హం. దీనిపై కొంపల్లి మున్సిపాలిటీ కమిషన్ కృష్ణారెడ్డిని వివరణ కోరగా త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.