ఘట్కేసర్, మే 10: ఘట్కేసర్ పట్టణ ప్రజలను ఏండ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మా ణ పనుల తీరు స్థానిక ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. నిధులు మంజూరు కాలేదనే కారణంతో అర్ధాంతరంగా పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం తాజాగా భారీ మొత్తంలో నిధులు విడుదల చేసినప్పటికీ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఈనెల 7న ప్రభుత్వం రూ.3 కోట్ల 87 లక్షల 54 వేల నిధులను విడుదల చేసినట్లు అధికార పార్టీ నాయకులు గొప్పగా ప్రకటించారు.
సీఎం, అధికార పార్టీ ముఖ్య నేతలకు క్షీరాభిషేకాలు చేస్తూ సంబురాలు నిర్వహించారు. కానీ పనులు ప్రారంభం ఎక్కడా అంటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిధులు వచ్చాయని చెప్పుకుంటే సరిపోతుందా..? పనులు ఎప్పుడు మొదలవుతాయంటున్నారు. వాస్తవానికి నిధుల కొరత వల్లే పనులు నిలిచిపోయాయని ఇప్పటి వరకు ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు నిధులు విడుదలైన తర్వాత కూడా పనులు ఎందుకు ప్రారంభం కాలేదన్న విషయంలో సమాధానం చెప్పలేకపోతున్నారు. పనులు నిలిచి పోయి నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు, కనీస పర్యవేక్షణ కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల రాకపోకలకు కీలకమైన బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమవడంతో రోజూ ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల భయం పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనుల్లో పురోగతి ఏదీ?
అలాగే.. అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రచార హంగామా తప్ప పనుల పురోగతిపై దృష్టిపెట్టడం లేదని మండిపడుతున్నారు. నిధులు విడుదలయ్యాయని చెప్పుకుంటూ ఫొటోలకు పరిమితమవుతున్న నాయకులు, కాంట్రాక్టర్‌పై వత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, అధికార పార్టీ ముఖ్య నాయకులు స్పందించి కాంట్రాక్టర్‌తో వెంటనే పనులు ప్రారంభింపజేయాలని, లేకపోతే ప్రజా ఆందోళనలు తప్పవని పట్టణ ప్రజలు హెచ్చరిస్తున్నారు.