వరంగల్/ మహబూబ్‌నగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఒడిసిపట్టడంలో రాష్ట్ర సర్కార్ విఫలమవుతున్నది. గత కొంతకాలంగా గోదావరికి నిత్యం వస్తున్న వరదను దిగువకు వదులుతూ పొరుగు రాష్ర్టాలకు సహకరిస్తున్న సర్కార్, రాష్ట్ర రైతాంగం ఆశలపై నీళ్లు చల్లుతున్నది.
ఇక ఎగువన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద వచ్చి చేరుతున్నది. సుదీర్ఘ విరామం తరువాత కృష్ణా నదికి వస్తున్న వరదనైనా సర్కార్ ఒడిసి పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే 24 గంటల్లో ఎగువ నుంచి
వరద జూరాల, తద్వారా దిగువన శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుకునే అవకాశమున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొంటుందా? వృథాగా దిగువకు వదిలేస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఎగువన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద వచ్చి
చేరుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి ఉదయం వేళ 84,888 క్యూసెకుల వరద రాగా, సాయంత్రానికి 67,500 క్యూసెకులకు తగ్గింది. ఇక ఇప్పటికే రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకోగా, వరదలో 35,000 క్యూసెకులను దిగువన నారాయణపూర్‌కు వదులుతున్నారు.
ఇక నారాయణపూర్ డ్యామ్ సైతం పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకునే అవకాశముండటంతో అక్కడి నుంచి 25, 560 క్యూసెకుల వరదను దిగువకు వదులుతున్నారు. ఆ జలాలు తెలంగాణను తాకడానికి మరో 24 గంటలు పట్టే అవకాశమున్నదని ఇంజినీర్ల అంచనా. ఎగువ నుంచి వరద వస్తున్నదనే
సమాచారంతో జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో కట్టిన బరాజ్లన్నీ నిండి కిందికి వచ్చే వరకు తెలంగాణకు 10వేల క్యూసెకుల వరద మాత్రమే వచ్చే అవకాశమున్నదని అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుతం కృష్ణా బేసిన్లోనైనా నీటిని సర్కార్ ఎత్తిపోస్తుందా? అనేది అనుమానంగా మారింది. ఈ సారి ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో కృష్ణా నదిలో చుక నీరు లేకుండా పోయింది. మే చివరి వారంలో జూన్ రెండో వారం వరకు కృష్ణా నదికి స్వల్ప వరదలు వచ్చాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ జలాలను ఒడిసిపట్టలేక చేతులెత్తేసింది. తాజాగా మళ్లీ వరద మొదలైంది. తద్వారా తాగునీటికి మాత్రం ఢోకా లేని పరిస్థితి ఉన్నదని అంచనా వేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్‌లు సైతం ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల పరిధిలో చెరువులతోపాటు, పలు రిజర్వాయర్లు సైతం ఉన్నాయి. వరద మొదలు కాగానే నీటిని ఎత్తి వాటిని నింపుకొనే అవకాశమున్నది. అయితే ప్రస్తుతం భీమా, కోయిల్‌సాగర్ లిఫ్ట్ స్కీమ్‌లలో పలు మోటర్లు పనిచేయని పరిస్థితి నెలకొన్నది.
ఈ నేపథ్యంలో నీటి ఎత్తిపోతలు అంతంతమాత్రంగానే ఉండే అవకాశమున్నదని తెలుస్తున్నది. దీంతో జలాలు దిగువకు శ్రీశైలానికి వెళ్లే అవకాశమున్నది. ఇక అక్కడ కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌లు సైతం ఉన్నాయి. కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో దాదాపు 8టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పలు రిజర్వాయర్లు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్‌లో భాగంగా నిర్మించిన నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం దాదాపు 6టీఎంసీలు. ప్రభుత్వం వచ్చిన జలాలను వచ్చినట్టు ఎత్తిపోసి ఆయా రిజర్వాయర్లకు మళ్లించవచ్చు. అయితే ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తుందా? లేదా? అనేది సందేహంగానే కనిపిస్తున్నది.
గలగలా గోదారి ఆంధ్రాకు పారి! (24.7.26 సాయంత్రం 6 నుంచి 25.7.26 సాయంత్రం 6 వరకు)
గత 24 గంటల్లో ఏపీకి పారిన నీళ్లు 10.95టీఎంసీలు
ఈ సీజన్లో వృథాగా పోయిన నీళ్లు 106.43 టీఎంసీలు
మేడిగడ్డ వద్ద ప్రస్తుత నీటి ప్రవాహం1,22,660 క్యూసెక్కులు
నాలుగైదు రోజులుగా మహారాష్ట్రలో నాగ్‌పూర్, రాజురా, చంద్రాపూర్, గడ్చిరోలి, సిరోంచా తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి ములుగు జిల్లా తుపాకులగూడెం దాకా గోదావరి తల్లి లక్షకు పైగా క్యూసెక్కులతో కళకళలాడుతున్నది. ఫలితంగా శనివారం జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయం సమీపంలోని వీఐపీ పుష్కరఘాట్ వద్ద గోదావరి 6.01 మీటర్ల ఎత్తు (మెట్లపైకి (నాలుగైదు మెట్లు నీటమునిగాయి)పై నుంచి ప్రవహిస్తున్నది.
మేడిగడ్డ బరాజ్ వద్దకు 1,22,660 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. బరాజ్‌కు ఉన్న మొత్తం 85 గేట్లను ఓపెన్ చేసి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే వరద మేడిగడ్డకు దిగువన దాదాపు 55 కిమీ దూరంలో ఉన్న తుపాకులగూడెం (ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సమక్క బరాజ్) బరాజ్ వద్దకు రాగానే అది 1,65,300 క్యూసెక్కులకు చేరింది. అంటే సమ్మక్క బరాజ్‌కు ఎగువన ఇంద్రావతి గోదావరిలో కలిసిన తరువాత 42,640 క్యూసెక్కులు పెరిగాయి. అయితే, సమ్మక్క బరాజ్ వద్దకు చేరిన వరద నీటి నుంచి దేవాదుల ప్రాజెక్టులో 9పంప్‌ల ద్వారా 2306 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్నారు. మిగిలిన 1,62,994 క్యూసెక్కుల నీటిని సమక్క బరాజ్‌కు ఉన్న 16 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రాణహితలో జూన్ మొదటి వారం నుంచే వరద ప్రవాహం నమోదవుతున్నది. ఈ వరద రోజుకు కనీసం 10టీఎంసీల చొప్పున రెండు రోజుల్లో (శుక్ర, శనివారం)నే 20 టీఎంసీల నీరు రెండు జిల్లాలను దాటిపోయిందని నీటిపారుదల శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఆ లెక్కన ఈనెల 2వ తేదీ నుంచి
శనివారం (జూలై 25వ, 2026వ తేదీ) వరకు 106.43 టీఎంసీలపైనే మేడిగడ్డను దాటుకొని వెళ్లాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదికల సారాంశం. అయితే, మేడిగడ్డ నుంచి 15కిమీ దూరం దిగువకు వెళ్లాక గోదావరిలో ఇంద్రావతి కలిసిన తరువాత తుపాకులగూడెం నుంచి దిగువకు వెళ్లిన నీటితోకలిపితే దాదాపు 125 నుంచి 130 టీఎంసీలు ఉంటాయని అధికారుల అంచనా.
ఇక కన్నెపల్లి (జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం) పంప్‌హౌస్ వద్ద శనివారం సాయంత్రానికి 97.8 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉన్నది. గోదావరి ఫోర్-బే నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద వాటర్ లెవల్ 93 మీటర్లు ఉంటే పంపులను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయవచ్చు. కానీ, గోదావరి కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద సాధారణ వాటర్ లిఫ్టింగ్ లెవల్ కన్నా 5 మీటర్ల అధికంగా పారుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పిల్లర్ల పర్రెలను సాకుగా చూపి ఎత్తిపోయకపోవటం గమనార్హం.
గోదావరినీటి ప్రవాహాన్ని ఎంతోకాలం దాచిపెట్టలేమని ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించిందా? అంటే శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ వ్యవహరించిన తీరే అందుకు సాక్ష్యం. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వానలతో గోదావరికి వరదపోటెత్తింది. అయితే, ఈ పోటెత్తుతున్న వరద లెక్కలను
కాంగ్రెస్ ప్రభుత్వం దాచి ఉంచాలని చేసిన ప్రయత్నాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో సహా బయటపెట్టింది.
‘గోదావరిలో తప్పిన ‘వరద’లెక్క, నీటిపారుదల శాఖ లెక్కలు తప్పుల తడక’ అనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దాకా మేడిగడ్డ వద్ద 22,200 క్యూసెక్కుల నీరే
దిగువకు వెళ్తున్నదని లోకానికి వెల్లడించి అసలు విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తే కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్ మెట్లను తాకి కాంగ్రెస్ సర్కార్ అసలు విషయాన్ని దాచిపెడుతున్నదని గోదావరి తేటతెల్లం చేసింది. ఈ క్రమంలోనే శనివారం నీటిపారుదల శాఖ మేడిగడ్డ బరాజ్ వద్ద అసలైన ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోను
వెల్లడించాల్సిన అనివార్యతను ‘నమస్తే తెలంగాణ’ కల్పించడం గమనార్హం.
