సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రజలకు అసౌకర్యం కల్గిస్తూ చట్టాన్ని అతిక్రమంచే వాళ్లు ఎంతటి వారైనా సరే.. పోలీసులు కేసులు నమోదు చేయాలి… ప్రజలను ఇబ్బందులుకు గురిచేసే వాళ్లపై పోలీసులు సుమోటో కేసులు నమోదు చేయాలి… అలా చేసి చట్టం అందరికి సమానమే… ! చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రజలకు భరోసా ఇవ్వాలి… కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఎక్కడా కన్పించడం లేదు. అధికార పార్టీ నాయకులకు చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి.. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ.. కండ్లు మూసుకుంటూ చట్టాన్ని మేం అమలు చేయలేమంటూ కొందరు పోలీసులు చేతులెత్తేస్తున్నారు.
పోలీసుల తీరుపై..
15 రోజుల కిందట మల్కాజిగిరి చౌరస్తాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హంగామా చేశారు. గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఆయన తండ్రి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చెప్పినట్లే చేస్తున్నారనే విమర్శలున్నాయి.
ఈ క్రమంలోనే బోనాల చెక్కులకు సంబంధించిన విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు మధ్య అల్వాల్‌లో గొడవ జరిగింది. మల్కాజిగిరి చౌరస్తాలో యువ ఎమ్మెల్యే హంగామా చేశారు. తన బలగంతో అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను స్తంభింప జేశారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక మల్కాజిగిరి పోలీసులను కూడా ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడారు.
రాజకీయ గొడవల నేపథ్యంలో ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలంటూ అక్కడున్న చాలా మంది తమ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, యువకులు, మహిళలు ఇంటికి వెళ్లే సమయంలో చౌరస్తాలో గంటల తరబడి ఈ గొడవ ఏందీ అంటూ మాట్లాడుకున్నారు. ఇదంతా సోషల్‌మీడయాలో వైరల్ అయ్యింది. గంటల తరబడి సామాన్యులు ఇబ్బందులు పడిన విషయం పోలీసులు కండ్లతో చూశారు. సుమోటోగా అలజడి సృష్టించిన వారిపై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాలి. కానీ ఒక్క పోలీసు అధికారి కూడా కేసుల విషయం మాట్లాడకుండా, ఆ విషయం ఎవరైనా ప్రస్తావిస్తే గప్‌చుప్ అంటూ నోరు తెరవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అధికార పార్టీ నాయకులకు ఒక చట్టం.. సామాన్యులకు మరో చట్టం అమలవుతుందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తూ అధికార పార్టీ నాయకులు చేసే పనులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చట్టం అందరికీ సమానమనే విషయాన్ని మరిచిపోవద్దని ప్రజలు సూచిస్తున్నారు. కాగా, ఈ విషయంపై మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో మాట్లాడగా ఈ ఘటనపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని తెలిపారు.