ప్రభుత్వ భూమిలో పెద్దల పాగా..
బాలాపూర్‌లో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. ప్రజావాణిలో ఫిర్యాదు రాగానే కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడుతామని ప్రకటించుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఈ కబ్జా కనిపించడం లేదు. కబ్జాపై రెవెన్యూ నివేదిక కోరిన తర్వాత వారు కబ్జా అని ధ్రువీకరించి పదినెలలు దాటినా తొలగించలేదు. ఒకవైపు నిరుపేదల గుడిసెలు నేలమట్టం చేస్తున్న హైడ్రా ఇలాంటి పెద్దోళ్ల కబ్జాలపై మాత్రం మౌనం వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని సర్వేనంబర్ 74లోని మూడెకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి కబ్జాపై వచ్చిన ఫిర్యాదులకు రెవెన్యూ అధికారులు స్పందించారు.
సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి 3.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ గతేడాది డిసెంబర్లో ఫిర్యాదు చేయగా హైడ్రా అధికారులు దీనిపై నివేదిక కావాలంటూ బాలాపూర్ తహసీల్దార్‌ను కోరారు. ఈ సంవత్సరం జనవరి 6న తహసీల్దార్ స్పష్టంగా సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి, సింగిరెడ్డి దయాకర్‌రెడ్డి, సుచిత్రారెడ్డి ఈ భూమిని ఆక్రమించుకున్నారని, ఇక్కడ షెడ్లు వేసుకున్నారని హైడ్రా కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. ఇవి పూర్తిగా ఆక్రమణలేనని, వీటిని తొలగించాలని కోరారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ రెవెన్యూ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఆ భూమి విలువ రూ.60కోట్ల విలువ ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం అర ఎకరం మాత్రమే ఖాళీగా ఉండడంతో అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ మిగతా స్థలంలో ఉన్న నిర్మాణాలను తొలగించడానికి హైడ్రా ముందుకు రాలేదు.
వారిపై ఎందుకంత ప్రేమ..!
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని బాలాపూర్‌కు చెందిన స్థానికులు గడ్డం వెంకటేశ్, నీరుడు శ్రీరాములు, తిమ్మని గిరీశ్, కొప్పుల రాజు తదితరులు కలెక్టర్‌కు, ఆర్డీవోకు, తహసీల్దార్‌కు బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్‌కు, హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల మేరకు బాలాపూర్ తాసీల్దార్ ఇందిరా దేవి ఆధ్వర్యంలో సర్వే చేయించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయించారు. రెవెన్యూ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కబ్జా చేసిన స్థలాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు హైడ్రాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు హైడ్రా ఆ నిర్మాణాలపై చర్య తీసుకోలేదంటే కబ్జాదారులపై హైడ్రాకు ఎందుకు ఇంత ప్రేమ అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ మూడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో వ్యాపార సముదాయాలు వెలిశాయి. అయితే హైడ్రా అధికారులు, సిబ్బంది అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గే ఈ ప్రభుత్వ భూమి కబ్జా వైపునకు చూడడం లేదని స్థానికులు అంటున్నారు.
నల్లచెరువు పక్కన గుడిసెల కూల్చివేత

కూకట్పల్లి నల్లచెరువు పక్కన ఉన్న ప్రగతినగర్‌లో పేదలు నివసించే గుడిసెలను హైడ్రా గురువారం కూల్చి వేసింది. ఇరవై ఏళ్లుగా నివాసముంటున్నామని కాళ్లావేళ్లా పడ్డా వినకుండా గుడిసెలు, రేకుల షెడ్డును నేలమట్టం చేశారు. అధికారులు కనికరం చూపించకపోవడంతో బాధితులు జేసీబీలకు అడ్డుపడ్డారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఈ ఆక్రమణలు ఉన్నాయంటూ చెప్పి సుందరీకరణకు గుడిసెలు అడ్డమంటూ నివాసాలను కూల్చేసి బడుగుజీవులను రోడ్డున పడేశారు. కూకట్‌పల్లిలోని నల్లచెరువు పక్కన దళితుల కాలనీ ప్రకాశ్‌నగర్ కాలనీ ఉంది. దళితులు తాత ముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిన భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు.
ఈ కాలనీ పక్కనే కూకట్పల్లి గ్రామం సర్వే నంబర్ 176లో నల్ల చెరువు ఉంది. దీని పక్కన సర్వే నంబర్ 180లో ప్రకాశ్‌నగర్ కాలనీ ఉండగా గతంలో రెవెన్యూ అధికారులు ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించి ఫెన్సింగ్ కూడా వేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లచెరువు సుందరీకరణ పేరుతో కూకట్పల్లి వైపు పట్టా భూముల్లో గదులను కూల్చివేశారు. ఎఫ్టీఎల్ హద్దులు కాకుండా శాటిలైట్ సర్వే పేరుతో ప్రకాశ్‌నగర్ వైపు దళితులు పట్టా భూముల్లో వేసుకున్న గుడిసెలు, రేకుల షెడ్డును కూల్చివేశారు. – సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ/బడంగ్‌పేట, నవంబర్ 27(నమస్తే తెలంగాణ)