సిటీబ్యూరో, జులై 16(నమస్తే తెలంగాణ) : ప్రణాళికలు అద్భుతంగా ఉన్నా… క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండానే కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టులు చేపడుతున్నది. ప్రకటించిన ప్రతి ప్రాజెక్టునూ వివాదాస్పదం చేస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తుందే తప్పా… సయోధ్యతో అభివృద్ధి పనులను పట్టాలెక్కించిన దాఖాలాలు ఈ ఏడాదిన్నరలో ఎక్కడా కనిపించలేవు. ప్రాజెక్టు ఏదైనా, ప్రణాళికలను పట్టాలెక్కించే క్రమంలో సామాన్యుల జీవనాధారాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా కూల్చివేతల నుంచి లగచర్ల ప్రాజెక్టుతోపాటు, తాజాగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు వరకు అన్ని కూడా వివాదాస్పద, ఆందోళనకరమైన పరిస్థితుల నడుమే పనులను చేపడుతూ బతుకులను ఛిద్రం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. పక్కా ప్రణాళికలు లేకుండానే ప్రాజెక్టులను చేపట్టి లక్షలాది మంది జీవితాలను ఆగం చేస్తోందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
నార్త్ సిటీ నుంచి నార్త్ తెలంగాణ ప్రాంతానికి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఎలివేటెడ్ ప్రాజెక్టు నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో ప్రాజెక్టు కోసం భూ సేకరణ పనులను చేపట్టింది. దాదాపు 12 కిలోమీటర్ల మేర జేబీఎస్ నుంచి తూంకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 6 లైన్ల రోడ్డు కోసం ఏకంగా 200 ఫీట్ల మేర వెడల్పుతో కారిడార్ నిర్మించనున్నారు.దాదాపు 1500కు ప్రైవేటు ఆస్తులతోపాటు, ఇతర భూములను సేకరించేందుకు చర్యలు చేపట్టారు. భూసేకరణ నోటిఫికేషన్, ఆ వెంటనే మార్కింగ్‌తోపాటు, 12కు పైగా గ్రామ సభలతో అభిప్రాయ సేకరణ చేశారు. కానీ ప్రాజెక్టు ప్రకటన నుంచి భూసేకరణ నోటిఫికేషన్ వరకు పరిహారం, ప్రాజెక్టు విధివిధానాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే సామాన్యుల ఆస్తులను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తూనే ఉంది.
200 ఫీట్ల వెడల్పుతో చేపట్టే ఈ ప్రాజెక్టు కారణంగా జేబీఎస్ నుంచి తూంకుంట వరకు దాదాపు 1500కు పైగా ఆస్తులు నేలమట్టం చేయాల్సి ఉంటుంది. కంటోన్మెంట్, తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు కాలనీలలోని వాణిజ్య సముదాయాలు, రెసిడెన్షియల్ భవనాలు కూలనున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్డు ప్రకారం కాకుండా… రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న మ్యాపుల ఆధారంగా రోడ్డుకు ఇరువైపులా వంద ఫీట్లకు మించి ఆస్తులన్నింటిని సేకరించడమే లక్ష్యంగా మార్కింగ్ చేశారు. దీంతో దశాబ్ధాల కాలంగా ఆయా ఆస్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎంతో మంది వయో వృద్ధుల బతుకులు ఆగం చేసేలా ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైంది. అవకతవకలతో కూడిన భూసేకరణ విధి విధానాలతో ఎంతో మంది భవన యజమానులు రోడ్డున పడే దుస్థితికి కాంగ్రెస్ సర్కారు కారణమైంది. కంటోన్మెంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 40-50 శాతం మేర ఆస్తులను కోల్పోయే అవకాశం ఉందని భావించారు. తాజా అడ్డగోలు మార్కింగ్ వల్ల ఒక్క యజమానికి 10 ఫీట్ల మేర ఆస్తులు కూడా మిగిలే అవకాశం లేదని తెలిసి గుండెలు బాదుకుంటున్నారు. ప్రజా ఉపయోగకరమైన ప్రాజెక్టును స్వాగతిస్తూనే… 200 ఫీట్ల మేర భూములు సేకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నిజానికి ఆరు లైన్ల వెడల్పుతో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టేందుకు భవన, నిర్మాణ నిబంధనల ప్రకారం 80-100 ఫీట్ల సరిపోతుంది. కానీ ఇరువైపులా వంద ఫీట్ల మేర ఆస్తులను లాక్కొనేలా వ్యవహరించడమే అసలు వివాదానికి కారణమైంది.
ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్టు కోసమైన భూము లు కోల్పోతున్న వారికి పరిహారాన్ని ముందుగా తేల్చాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పరిహారం ముచ్చట ఎత్తకుండానే భూములను గుంజుకొనే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఇక రక్షణ శాఖ కోల్పోతున్న దాదాపు 140 ఎకరాల భూములకు నగర శివారులో మూడింతల భూమిని పరిహారంగా ఇవ్వాలనే ప్రతిపాదనలను అంగీకరించిన రాష్ట్ర సర్కారు… ప్రైవేటు ఆస్తుల విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఎంతో మందికి జీవనాధారమైన ఈ ఆస్తుల విషయంలో సర్కారు భయభ్రాంతులకు గురిచేస్తుందే తప్పా… ఏనాడూ బాధితులతో సామరస్య పూర్వకంగా చర్చించలేదు. గడిచిన ఏడాది కాలంగా రాజీవ్ రహదారి నిర్వాసితులు జేఏసీగా ఏర్పడి రోడ్డెక్కుతున్న, కనీసం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని వాపోతున్నారు. ఇలా ఎలివేటెడ్ కారిడార్ పేరిట సామాన్యు ల ఆస్తులను కూల్చివేసి, రోడ్డున పడేలా వ్యవహరిస్తున్నది. ఇప్పటివరకు జరిగిన 12 గ్రామ సభలలో తమ అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసినట్లుగా జేఎసీ చైర్మన్ సతీశ్ గుప్తా వ్యాఖ్యానించారు.
అడ్డగోలుగా భూమిని సేకరించే క్రమంలో కనీసం 10 గజాల కూడా చేతికి అందే అవకాశం లేదని 5 దశాబ్ధాలుగా కార్ఖానాలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ శ్రీనివాస్ కంటతడి పెట్టుకున్నారు. తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్న మరో వ్యక్తి 460 గజాల జాగాలో నిర్మించిన కమర్షియల్ బిల్డింగ్‌తో తన కుటుంబ పోషణ సాగిందని వివరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత నిర్ణయంతో తన చేతిలో 20 ఫీట్ల జాగా కూడా ఉండదని వాపోయారు. ప్రాజెక్టుకు అవసరమైన దాని కంటే ఎక్కువ వెడల్పుతో భూములను సేకరిస్తుండటం దశాబ్ధాల కాలంగా వారసత్వంగా కట్టుకున్న నిర్మాణాలు నేలకూలుతున్నాయని ఎంతో మంది వయోవృద్ధులు వాపోతున్నారు. ఇలాంటి సమస్యల కారణంగానే ప్రాజెక్టు వెడల్పును 200 నుంచి 100 ఫీట్లకు తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యమిస్తున్నామని జేఎసీ నాయకులు తెలిపారు. ఇక కోల్పోతున్న భూ ముల మార్కెట్ విలువకు సమానంగా భూములైనా ఇవ్వాలి లేదా… మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం రెండింతలు ఇస్తేనే వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను విడిచిపెడతామని స్పష్టం చేశారు.
నిజానికి ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయంతో సామాన్యులు భయపడిపోతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఇప్పటికీ ఎంతో మంది వృద్ధులు, వయోజనులు మృత్యువాత పడ్డారు. ఇన్నాళ్లు ఇవే తమ ఆస్తిపాస్తులనీ, వీటితో కుటుంబాలను పోషించుకుంటే… ఇక ఉన్న ఆస్తులను కోల్పోతే తమ బతుకు దెరువుకు దిక్కు ఎవరనే ఆందోళనతో ఇప్పటివరకు 10మందికిపైగా చనిపోయినట్లు పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రభు త్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేకుండానే…ఒంటెద్దు పోకడలతో తమ ఆస్తుల విషయంలో చేస్తున్న దౌర్జన్యాన్ని సహించలేకనే దాదాపు 80 శాతం మంది భూ యజమానులు కోర్టులను ఆశ్రయించారు. మిగిలిన వారు కూడా తమ ఆస్తులను పరిరక్షించుకునేందుకు కోర్టు మెట్లను ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు. అయినా ప్రభుత్వం గ్రామసభలకు రావాల్సిందే.. అభిప్రాయం చెప్పాల్సిందే.. భూములు ఇవ్వాల్సిం దే.. ఇవ్వకపోతే అరెస్టులు తప్పవన్నట్లుగా వ్యవహరిస్తూ అక్రమ కేసులతో భయపెడుతున్నదని ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న జేఎసీ నేతలను బైండోవర్లు, అరెస్టులతో భూము లు లాక్కుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.