సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ ) : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) పనులపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా రూ.5112.36కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టగా.. 38 చోట్ల అందుబాటులోకి తీసుకువచ్చి ట్రాఫిక్ కష్టాలను దూరం చేశారు. అయితే పురోగతిలో ఉన్న 9 ప్రాజెక్టులకు నిర్దేశిత లక్ష్యాలను ఖరారు చేసింది. గడువులోగా పనులను పూర్తి చేసి విడతల వారీగా అందుబాటులోకి తీసుకురావాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ పనులపై సమీక్షించిన దాఖలాలు లేవు.
ఫలితంగా ఎస్ఆర్డీపీ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. ఇప్పటికే బైరామల్‌గూడ లూప్‌లు అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ పనులపై తీవ్ర జాప్యం నెలకొంది. ఈ క్రమంలోనే శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. భూసేకరణ సమస్య వెంటాడుతోంది. ఆరు చోట్ల ప్రాజెక్టులకు నిర్దేశిత లక్ష్యాలను ఖరారు చేసినప్పటికీ సకాలంలో అందుబాటులోకి రావడం కష్టమేనని స్వయంగా అధికారులే చెబుతున్నారు. పనుల్లో వేగం పెంచాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ఖర్చు పెరగడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు అధికమవుతుండటం పై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఎస్ఆర్డీపీ తొలి విడత పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
