GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంటున్నది. వారం రోజుల వ్యవధిలో చేతికి అందాల్సిన జనన, మరణ ధృవపత్రాలు 2 వారాలు గడిచినా అందడం లేదు. ఫలితంగా ఈ సర్టిఫికెట్ల కోసం అటు తల్లిదండ్రులు, ఇటు డెత్ సర్టిఫికెట్లకు బాధిత కుటుంబ సభ్యులు మీ సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పది రోజులు గడిచినా జనన ధృవపత్రం ఆన్లైన్లో రావడం లేదని బన్సీలాల్‌పేటకు చెందిన మహాలక్ష్మి అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, 30 సర్కిళ్ల పరిధిలోని దాదాపు 3500 సర్టిఫికెట్ల పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. సంబంధిత ఏఎంఓహెచ్‌లు, ఏఎంసీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి కారణంగానే సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం అవుతూ సమస్యకు కారణమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తప్పుల తడక.. ఇంకో సమస్య
జీహెచ్ఎంసీ పరిధిలో జారీ అయ్యే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు తప్పుల తడకగా ఉంటున్నాయి. దీంతో ధృవపత్రాలు పొందేవారికి ఇది ఇంకో సమస్యగా మారింది. ఒక్కో సర్కిల్లో దాదాపు 500 నుంచి 700 వరక కరెక్షన్ ఫైళ్లు పెండింగ్‌లో ఉండడం అధికారుల పనితీరును నిదర్శనంగా చెప్పవచ్చు . వాస్తవంగా జీహెచ్ఎంసీ పరిదిలోని 30 సర్కిళ్లలో ప్రతి ఏటా గరిష్టంగా మూడున్నర లక్షల వరకు జననాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రైవేట్ దవాఖానాలో జనరేట్ చేస్తున్న బర్త్ సర్టిఫికెట్లలో తప్పులు తక్కువగా ఉంటుండగా..ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్న ధ్రుపపత్రాల్లో తప్పులు దొర్లుతున్నట్లు తెలుస్తున్నది. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన రిజిస్టార్ల్రుగా స్థానిక మెడికల్ ఆఫీసర్లు వ్యవహరిస్తుంటారు. కానీ చాలా సర్కిళ్లలో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడంతో అసిస్టెంట్ మెడికల్ కమిషనర్లు (ఏఎంసీ)లను బర్త్, డెత్ రిజిస్టార్ల్రుగా నియమించారు. ఈ నేపథ్యంలోనే బేగంపేట సర్కిల్ పరిధిలోని గాంధీ ఆసుపత్రి, గోషామహల్ సర్కిల్ పరిధిలోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ దవాఖాన, పేట్ల బురుజులోని సర్కారు వెటర్నరీ హాస్పిటల్, మెహిదీపట్నం సర్కిల్లోని నిలోఫర్ దవాఖానా పరిధిలో భారీగా కరెక్షన్ ఫైళ్లు పెండింగ్‌లు ఉన్నట్లు సమాచారం.