సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లు, సర్కిళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి భౌగోళిక పరిస్థితులను, ప్రజా అవసరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా సాగిన ఈ విభజనపై పౌరులు మండిపడుతున్నారు. సౌలభ్యం పెరగాల్సింది పోయి.. శాపంగా మారే అవకాశాలున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కనీసం ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా 30 సర్కిళ్లను ఆరు జోన్లతో డబుల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రాత్రి పొద్దుపోయాక జీవో ఇవ్వడం..అర్ధరాత్రి తర్వాత ఆఫీసు నేమ్ బోర్డులు మార్చి వేయడం వంటి పనులను ఆగమేఘాలపై చేయాల్సిన అవసరం ఏమి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. విస్తృతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నప్పుడు అందరితో చర్చించి నిర్ణయం తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇంటి పక్కనే ఉన్న కార్యాలయాలను ఇప్పుడు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరానికి వెళ్లాలని, చిన్నా ఫిర్యాదు ఇవ్వాలన్నా జోనల్ కార్యాలయానికి వెళ్లాలంటే రోజంతా పనులు మానుకునే పరిస్థితులు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జోన్ల ఏర్పాటు, సర్కిళ్ల ఏర్పాటు అంశంలోనూ రాజకీయ లబ్ధి కోసమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వీలినమైన 27 పురపాలికల్లో పౌరులకు జీహెచ్ఎంసీ సేవలు సవాల్‌గా మారనున్నాయి. 650 చదరపు కిలోమీటర్ల నుంచి రెండువేల 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు జీహెచ్ఎంసీ విస్తరించింది.దాదాపు 1400 చదరపు కిలోమీటర్ల అదనపు ఏరియాను పర్యవేక్షించడానికి కుక్కలను నియంత్రించే వెటర్నరీ డిపార్ట్మెంట్..దోమల నియంత్రణ మలేరియా విభాగం, పార్కుల నిర్వహణ కోసం ఉండే అర్బన్ బయో డైవర్సిటీ వింగ్..వీధి దీపాల నిర్వహణకు ఎలక్ట్రిసిటీ వంటి విభాగాలను శివారు ప్రాంతాలకు వేగంగా విస్తరించి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వాస్తవంగా ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ వ్యవస్థ మీద ఆధారపడి విలీనమైన పురపాలికల్లో సేవలను ప్రశ్నార్థకం చేశారు. శివారు ప్రాంతాల్లో ఇప్పటికే టాయిలెట్ వ్యర్థాల నిర్వహణ మెకానిజం లేదని చెబుతున్నారు. విశాలమైన రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, వీధి లైట్ల నిర్వహణ, సమగ్రంగా పట్టణ ప్రణాళికను అమలు చేయడం, పౌర సేవలను సమర్థవంతంగా అందించడం అధికారులకు సవాల్‌గా మారనుందని నిపుణులు చెబుతున్నారు.
కుత్బుల్లాపూర్ జోన్లో అత్యధికంగా ఏడు సరిళ్లు తర్వాత స్థానంలో రాజేంద్రనగర్ జోన్లో ఆరు సరిళ్లు ఉన్నాయి. వీటి తర్వాత మలాజిగిరి, ఉప్పల్, చార్మినార్, గోలొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఐదేసి చొప్పున సరిళ్లు, ఎల్బీనగర్, శంషాబాద్, కూకట్పల్లి జోన్లలో నాలుగేసి చొప్పున సరిళ్లు ఉన్నాయి.
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన కొత్త డివిజన్లలో గతంలో ప్రతిపాదించిన సఫిల్‌గూడ డివిజన్‌ను తొలగించి, కొత్తగా కాకతీయనగర్ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా బలరాంనగర్ పేరును, ప్రాంతాలను మార్పులేదు. మౌలాలి, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లలో మార్పులు కనిపించలేదు. ఓటర్లు మధ్య వ్యత్యసంతోనే డివిజన్లు కూర్పును కొనసాగించారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో భాగంగా ఉన్న యాప్రాల్ డివిజన్‌ను కీసర సర్కిల్ కార్యాలయంలో భాగం చేయడం హాస్యాస్పదంగా మారింది. గతంలో మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఉన్న యాప్రాల్ను మల్కాజిగిరిలో కానీ, అల్వాల్ సర్కిల్లో కానీ భాగం చేయకుండా కీసరలోకి మార్చారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయానికి, కానీ మల్కాజిగిరిలో భాగంగా ఉంచకుండ కీసరలో భాగం చేయడంతో మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధం లేకుండా పోతుంది.
వార్డుల విభజన పైనల్ డ్రాప్టులో పూర్తిస్థాయి మార్పులు చేయలేదు. కొన్ని డివిజన్ల పేర్లు మార్చారు.. మరికొన్నింటిని వదిలివేశారు. జనాభ, ఓటర్ల వ్యత్యాసం తగ్గించలేదు. యాప్రాల్ డివిజన్‌ను కీసర సర్కిల్లో చేర్చడం సరికాదు. అల్వాల్ సర్కిల్, మల్కాజిగిరి సర్కిల్లో కానీ యాప్రాల్ డివిజన్‌ను కలుపాలి. వార్డుల మధ్య దూరభారం తగ్గించడంలో విఫలమయ్యారు. విభజన ప్రక్రియలో పారదర్శకత లోపించింది. అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పట్టించుకోలేదు. కమిషనర్‌కు ఇచ్చిన కొన్నింటిని మార్పులు చేశారు, మరికొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిస్థాయిలో చర్చించకుండా చేసిన అసమగ్ర చర్యలను ఖండిస్తున్నాం.
-ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
విస్తరిత జీహెచ్ఎంసీలో 300 వార్డుల తుది డీ లిమిటేషన్‌కు గెజిట్ నోటిఫికేషన్ వెలువడడం, వెనువెంటనే గతంలో కంటే రెండింతలుగా 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా ఏర్పడడంతో అన్ని జోన్, సర్కిల్ స్థాయిలో రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం 12 జోన్లలో ప్రతి జోన్ ఒక మినీ కార్పొరేషన్లా తలపించనున్నది. ఒకో సరిల్లో 4 నుంచి 6 వార్డుల ప్రభావంతో పాటు సరిల్ ఆధిపత్య పోటీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా విలీనమైన మున్సిపాలిటీల ప్రాంతాల్లో కొత్త సరిళ్లు ఏర్పాటు కావడంతో, అకడి స్థానిక నాయకత్వంలో పోటీ తీవ్రం కానుంది. మలాజ్ గిరి, ఉప్పల్, ఎల్ బీ నగర్ జోన్ల్లో కొత్త వార్డుల సంఖ్య గణనీయంగా పెరగడం రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో కార్పొరేషన్ పరిధికి బయట ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కీలక వార్డులుగా మారాయి.
పట్టణ, గ్రామీణ రాజకీయాల మిశ్రమ ప్రభావం, పాత నగర ఓటింగ్ సరళికి భిన్నమైన ఫలితాల అవకాశం కలగనుంది. చార్మినార్, గోలొండ జోన్లలో సరిళ్ల పునర్విభజన సున్నితమైన రాజకీయ సమీకరణాలకు దారితీయనుంది. కొన్ని వార్డులు కొత్త సరిళ్లకు మారడంతో, సంప్రదాయ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మార్పులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పశ్చిమ జోన్లు అభివృద్ధి రాజకీయాలకు వేదికగా మారనున్నాయి. శేరిలింగంపల్లి, కుకట్ పల్లి జోన్ల్లో ఐటీ కారిడార్ ప్రభావం కనిపించనున్నది. అభివృద్ధి, మౌలిక వసతులు, ట్రాఫిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలే ఎన్నికల ప్రధాన అజెండాగా మారనున్నాయి. ఇకడ సరిల్ ఆధారిత పనితీరే కార్పొరేటర్ల భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.