మల్కాజిగిరి, సెప్టెంబర్ 24: మల్కాజిగిరి నియోజకవర్గం, మచ్చబొల్లారం డివిజన్లోని ఏడు కాలనీల డ్రైనేజీ సమస్యను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం మచ్చబొల్లారం డివిజన్, ఏడు కాలనీల డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే.. గ్రేటర్ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ కాలనీల్లో సరియైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే గ్రేటర్ టౌన్ ప్లానింగ్ అధికారులు బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని అన్నారు. బహుళ అంతస్తులు నిర్మించిన తర్వాత డ్రైనేజీని బయటకు వదులుతున్నారని అన్నారు. తుర్కపల్లి ప్రాంతంలోని మడుకట్ల బస్తీ, శ్రీదామ్ ఎన్క్లేవ్ ప్రాంతాలను హకీంపేట ఎయిర్‌ఫోర్స్ లోపలి నుంచి వరదనీరు ముంచెత్తుతున్నదని అన్నారు.
ఇప్పటికే దీనిపై ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వర్మతో చర్చించామని, వారు సానుకూలంగా స్పందించి.. పైప్‌లైన్ ద్వారా వరదనీరు ప్రవహించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఎయిర్ఫోర్స్వారు నిర్మించే పైపులైన్‌కు అనుసంధానంగా ప్రభుత్వం మరో పైపులైన్ నిర్మించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల అధికారులు ప్రొటోకాల్ పాటించడంలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజయ్య, పరశురాంరెడ్డి, కరంచంద్, జీకే హన్మంతరావు, రమేశ్, ఉపేందర్‌రెడ్డి, రాముయాదవ్, అనిల్‌కిశోర్, తదితరులు
పాల్గొన్నారు.