షాద్‌నగర్, జూలై 7 : స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ చౌరస్తాలో నిరసనలు తెలిపిన అనంతరం మాట్లాడారు. చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం జీఓ 641ని విడుదల చేయడం దురదృష్టకరమని, పచ్చని పల్లెలను కలుషితం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకోవడం బాధాకరమని మండిపడ్డారు.
సిద్దాపూర్ గ్రామ ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు, గిరిజన తండాలవాసులు ప్రభు త్వం ఇచ్చిన జీఓపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లో స్పందన లేదన్నారు. గ్రామంలో చెత్త డంప్ యార్డు నిర్మాణం జరగదని ప్రజలను నమ్మించిన ఎమ్మెల్యే.. నేడు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ నాయకులు రూ.50 కోట్ల ముడుపులను తీసుకొని చెత్త డంప్ యార్డు నిర్మాణానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారని, రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు.
సిద్దాపూర్ భూముల్లోకి అధికారులు వస్తే తరిమికొట్టాలన్నారు. స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని, నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జీఓ 641ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. పచ్చని పల్లెలను కలుషితం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని, చెత్త డంపింగ్ యార్డుతో స్థానిక అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులోభాగంగా స్థానిక నేతలతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో చెత్త డంపింగ్ యార్డు వ్యతిరేక జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, నాయకులు యుగేందర్, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రామకృష్ణ, సిద్దాపూర్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులున్నారు.

ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డిపై కేసు నమోదు
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిపై షాద్నగఱ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో సిద్దాపూర్ డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై అర్ధరహిత ఆరోపణలు చేశాడని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యాలు, ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకున్నారనే వ్యాఖ్యాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్న వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.