గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ విస్తరణపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత, అశాస్త్రీయ విస్తరణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు విభజన, విస్తరణ, విలీనం వల్ల తమకు కలిగే నష్టంపై గళమెత్తుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో భాగమైన ప్రాంతాల విభజన, కొత్త మున్సిపాలిటీల విలీనం అంతా అస్తవ్యస్తంగా ఉండటంతో విశ్వనగర ప్రజలంతా రగిలిపోతున్నారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతున్నదని మేధావులు గొంతెత్తున్నారు.
– సిటీ బ్యూరో
కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయం వల్ల చారిత్రక నగరం మూడు ముక్కలవుతున్నదని ఆందోళన చెందుతున్నారు. ఏండ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్ లేకుండా చేసి ఆ ప్రాంతం విశిష్టత కనుమరుగయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు పిలిపునిచ్చారు. మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేయడాన్ని నిరసిస్తూ అన్ని పార్టీలు ఏకమై ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. బడంగ్‌పేట, ఆదిభట్ల, ఆర్సీపురం వంటి జోన్లలను ఇష్టారీతిన విభజించి కొత్త సమస్యలు సృష్టించారని పోరుబాట పడుతున్నారు. కాంగ్రెస్ అశాస్త్రీయ విస్తరణను ఆ పార్టీ నేతలే తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎల్బీనగర్ జోన్ కూర్పు తప్పుల తడకగా ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు.
అస్తవ్యస్తంగా..
ఘనమైన చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను పక్కనపెట్టి ఈ ప్రాంతానికి మల్కాజిగిరి పేరు పెట్టడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. రాజేంద్రనగర్‌ను హైదరాబాద్‌కు, నార్సింగి సర్కిల్‌ను శేరిలింగంపల్లి జోన్లో కలిపి సైబరాబాద్‌లో కలిపారు. శంషాబాద్‌ను జోన్‌గా ఏర్పాటు చేసి కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ కార్పొరేషన్లో చేర్చారు. దీంతో రాజేంద్రనగర్ నియోజకవర్గం మూడుముక్కలైంది. అలాగే ఆదిభట్ల డివిజన్‌ను సర్కిల్‌గా ఏర్పాటు చేశారు. సర్కిల్ కార్యాలయం తొలుత ఆదిభట్లలోనే ఏర్పాటు చేసి.. దాన్ని తుర్కయంజాల్కి తరలించారు. ఆదిభట్ల సర్కిల్ ప్రజలంతా ఏ పని కావాలన్నా తుర్కయంజాల్‌కు వెళ్లాల్సిందే. ఆదిభట్లలోనే సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బడంగ్‌పేటను శంషాబాద్ జోన్లో కలపడంతో దూరభారం అవుతున్నది. బడంగ్‌పేట సర్కిల్ నుంచి శంషాబాద్ వెళ్లేందుకు బస్ సౌకర్యం కూడా లేదు.

Ghmc
గందరగోళం
-మల్రెడ్డి రంగారెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణపై అధికార కాంగ్రెస్ నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. అన్ని పార్టీలు, అన్ని వర్గాలు విస్తరణ తీరును తప్పుపడుతున్నారు. విస్తరణ అంతా గందరగోళంగా, తలాతోక లేకుండా చేసిందని అధికార పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నారు.
రగులుతున్న ప్రజలుఅసమర్థ
ఎమ్మెల్యేతో రాజేంద్రనగర్‌కు నష్టం
– బీఆర్ఎస్ యువనేత కార్తిక్‌రెడ్డి
అసమర్థ, అవినీతి ఎమ్మెల్యే వల్లే రాజేంద్రనగర్ ఉనికి కోల్పోతున్నది. నియోజకవర్గాన్ని సైబరాబాద్‌లోనే కొనసాగించాలి. హైదరాబాద్‌లో కలపడం వల్ల ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇక్కడి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై పెట్టిన దృష్టి.. ప్రజలపై పెట్టకుండా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపడం లేదు. రాజేంద్రనగర్‌ను ముక్కలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చేదాగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తాం.
రాజుకుంటున్న నిరసనలు 17న భారీ ర్యాలీ
– ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సరిల్ల మీదుగా ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తాం. ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్‌ను ముట్టడిస్తాం. బంద్‌లు, ధర్నాలు నిర్వహిస్తాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం. ముఖ్యమంత్రికి దమ్ము ఉంటే హైదరాబాద్ పేరు మార్చాలి. కానీ 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరుతో కాకుండా వేరొక పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు.