ఆర్కేపురం, బడంగ్‌పేట, జూలై 15: ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేను కింద కూర్చోబెట్టడమేనా.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలన అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ దేవాలయ ఆవరణలో సోమవారం ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాల-2024 చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించారు. ఇదే కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌రావు కూడా హాజరయ్యారు. అయితే అధికారిక కార్యక్రమాల్లో సంబంధం లేని వ్యక్తులను వేదికపైకి పిలువడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో ఇతర వ్యక్తులు రావడానికి వీలు లేదన్నారు. ఏ హోదాలో కాంగ్రెస్ నాయకులను వేదిక మీదకు పిలుస్తున్నారని నిలదీశారు. అధికారిక కార్యక్రమాలకు పార్టీ నాయకులను పిలవడంపై ఆమె నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ నాయకుడు కేఎల్ఆర్తో పాటు మరికొంత మంది ఆ పార్టీ నేతలు వేదిక మీదకు రావడంతో ఎమ్మెల్యే కిందకు దిగిపోయారు. వేదిక కింద కూర్చొని నిరసన తెలిపారు.
సలహాదారు వేణుగోపాలరావు ఎమ్మెల్యేకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా.. ఆమె అంగీకరించలేదు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ప్రొటోకాల్ పాటించకుండా, ప్రజలతో ఎన్నుకున్న ఎమ్మెల్యేలను అగౌరపరుస్తున్నారని, ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలన్నారు.
ఎమ్మెల్యేతో పాటు ఓడిపోయిన అభ్యర్థి కూడా స్టేజీ మీద ఉన్నారంటే, సీఎం రేవంత్‌రెడ్డి కూడా కొడంగల్‌లో తనపై ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టేజీపై తన పక్కన కూర్చోబెట్టుకొనే విధంగా చట్టం తేవాలన్నారు. బోనాల పండుగ ఉత్సవాలకు నిధులివ్వాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే కేసీఆర్ అని తెలిపారు. 60వేల ఓట్లతో తనపై ఓడిపోయిన వ్యక్తిని స్టేజీపైకి తీసుకొచ్చి ప్రొటోకాల్ పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనన్నారు. ప్రభుత్వం తమదేనని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే… ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో తులం బంగారం ఇచ్చి పంపిస్తే స్వాగతించేవాళ్లమని సబితాఇంద్రారెడ్డి అన్నారు. గతంలో బోనాల ఉత్సవాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇన్చార్జీల వ్యవస్థ లేదని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇదేరీతిన ప్రొటోకాల్ సమస్య తలెత్తుతున్నదన్నారు. ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకొని ప్రొటోకాల్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్థంగా మారాయని విమర్శించారు. ఒక పక్క ఆందోళన కొనసాగుతుండగానే వేణుగోపాల్‌రావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బడంగ్‌పేట మేయర్ పారిజాత, చల్లా నర్సింహారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు కాంగ్రెస్ స్థానిక ప్రతినిధులతో కలిసి పలు ఆలయ కమిటీలకు చెక్కులను పంపిణీ చేసి వెళ్లిపోయారు. నిరసనలో బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్‌శర్మ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేశ్, లోకసాని కొండల్‌రెడ్డి, న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, సాజీద్, పెంబర్తి శ్రీనివాస్, సిద్దగోని వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.