బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్ బస్తీని ఆనుకుని ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్నిఆర్టీఏ కార్యాలయం కోసం కేటాయించడం వివాదాన్ని రాజేసింది. షేక్‌పేట మండలం సర్వే నంబర్ 403 టీఎస్-1, బ్లాక్ ఎఫ్, వార్డు 9లో జూబ్లీహిల్స్ రోడ్ నం. 78లో పద్మాలయ అంబేద్కర్ బస్తీని ఆనుకుని 1.30 ఎకరాల ఖాళీ స్థలంలో జూనియర్ కాలేజీ నిర్మించాలంటూ స్థానికులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
ఫిలింనగర్ 18 బస్తీల్లో సుమారు 1లక్షకు పైగా జనాభా ఉంటుందని, ఇక్కడ జూనియర్ కాలేజీ నిర్మిస్తే స్థానికులకు ప్రయోజనం ఉంటుందని.. అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కాగా, ఈ స్థలాన్ని వెస్ట్‌జోన్ ఆర్టీఏ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. మట్టి డంపింగ్ చేస్తూ స్థలాన్ని చదును చేస్తుండగా, శుక్రవారం జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్‌తో పాటు స్థానికులు అక్కడకు వెళ్లి పనులను అడ్డుకున్నారు.
పేద పిల్లల కోసం కాలేజీ నిర్మాణం చేయాల్సిన స్థలాన్ని వెస్ట్‌జోన్ ఆర్టీఏ కార్యాలయానికి ఎలా ఇచ్చారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ వ్యవరంపై తక్షణమే స్పందించాలని, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ప్రజల ఓట్లతో గెలిసిన దానం ఇక్కడి ప్రజలను గాలికి వదిలివేయడం దారుణమని కార్పొరేటర్ వెంకటేశ్ ఆరోపించారు.