సిటీబ్యూరో, ఏప్రిల్15, (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో తల్లిబిడ్డలకు ఏ కష్టం రాకుండా పదేళ్లపాటు రక్షణగా కేసీఆర్ నిలిస్తే.. కాంగ్రెస్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాల కారణంగా తెలంగాణలో గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. కేసీఆర్ పాలనలో క్షణాల్లో అమ్మ ఒడి వాహనాలు ఇంటి ముందు చేరితే, నేడు ఎన్ని సార్లు ఫోన్ చేసినా అందుబాటులో లేమని సమాధానాలు వినిపిస్తున్నాయి.
గతంలో తీరిక లేక తిరిగిన 102 వాహనాలు నేడు రోజులో మూడు ట్రిప్పులతో సరిపెట్టుకుంటున్నారు. వాహనాల జాప్యం కారణంగా సొంత వాహనాల్లోనే ఆసుపత్రులకు వెళ్తున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో సైతం సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు.
ఒకరిద్దరు ఉంటే రారట..
రాష్ట్రంలోని గర్భిణుల సంరక్షణలో భాగంగా వారికి నాణ్యమైన పరీక్షలు అందించడంతో పాటు ఇంటినుంచి ఆసుపత్రికి, తిరిగి ఇంటికి తీసుకొచ్చే ఆలోచనకు కేసీఆర్ ప్రభుత్వం అమ్మ ఒడికి నాంది పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా 2016లో అమ్మ ఒడి పథకంలో భాగంగా 102 వాహనాలను ప్రారంభించారు. గర్భిణులను నాలుగుసార్లు ప్రభుత్వాసుపత్రులకు తీసుకువెళ్లి అవసరమైన పరీక్షలు నిర్వహించి ఇంటిదగ్గర చేర్చడమే లక్ష్యంగా ప్రారంభించారు.
ఆశాలు వారికి తోడుగా ఉంటూ ప్రసవం జరిగే వరకు అవసరమైన పరీక్షలు దగ్గరుండి చేయించేవారు. 102 వాహనాన్ని సమన్వయం చేసుకొని గర్భిణులపై జాగ్రత్తలు తీసుకునేవారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 14 వాహనాలు ఉండగా ఒకప్పుడు ఒకరిద్దరు ఉన్నా కూడా ఆసుపత్రికి తీసుకొచ్చేవారు. కానీ నేడు పదిమంది ఉంటేనే వస్తామని, ఒకరిద్దరికీ రామని చెబుతుండటం గమనార్హం.
అంధకారంలో ఆశాల జీవితాలు..
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయకుండా రేవంత్ సర్కార్ ఆశాల జీవితాలను అంధకారంలోకి నెడుతుంది. బీఆర్ఎస్ పాలనలో తల్లిబిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్, బాలింతలకు కేసీఆర్ కిట్ అందించేవారు. దీంతో నిత్యం ఆసుపత్రుల్లో రద్దీగా కనిపించేది.
కానీ కాంగ్రెస్ పాలనలో వాహనాల నిర్లక్ష్యం, కిట్ అమలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు తగ్గుముఖం పడుతున్నాయి. టార్గెట్లు ఏమీ లేవని పై అధికారులు ఒకవైపు చెబుతుండగానే, జిల్లా అధికారులు మాత్రం నెలకు నాలుగు ప్రసవాల నమోదు తప్పకుండా ఉండాలంటూ ఆశాలకు ఆదేశాలు జారీచేస్తుండటం గమనార్హం. మరోవైపు కొందరు వైద్యులు నిర్లక్ష్య ధోరణి కారణంగా వచ్చే కేసులు కూడా పక్కనే ఉన్న ప్రైవేట్‌ను వెళ్తున్నాయి.
సొంత డబ్బులు పెట్టుకుంటున్నాం..
గతంలో అమ్మ ఒడి వాహనంలో ప్రయాణం చేసేవాళ్లం. అమ్మ ఒడి వాహనాల జాప్యం కారణంగా గర్భిణులు తమ సొంత వాహనాల్లో ఆసుపత్రులకు వెళుతున్నారు. మేము మా సొంత డబ్బులతో ఆటోలో ఆసుపత్రులకు వారి వెనుక వెళుతున్నాం. కిట్లు లేకపోవడం వల్ల గర్భిణులు నమోదు చేయించుకోవడం లేదు. టార్గెట్లపేరిట ఆశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
-సంతోష,బీఆర్టీయూ సంఘం ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు