బేగంపేట, సెప్టెంబర్ 13: శవాలను కాల్చే చోట వ్యభిచారం దందా వెలుగులోకి వచ్చింది. బేగంపేటలోని ధనియాలగుట్ట శ్మశాన వాటికలో కొంత కాలంగా ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్నది. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీస్, బేగంపేట పోలీసులు దాడి చేసి.. నిర్వాహకురాలిని అరెస్టు చేసి శనివారం రిమాండ్కు తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనియాలగుట్ట శ్మశాన వాటికలో స్థానికంగా ఉంటున్న దంపతులు అక్కడే వాచ్మెన్గా ఓ గదిలో ఉంటున్నారు.
వాచ్మెన్ భార్య(39) కొంత కాలంగా పలువురి మహిళలతో గుట్టు చప్పుడు కాకుండా అదే ప్రాంగణంలోని ఓ గదిలో విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నది. ఆమెపై గతంలోనూ బోయినపల్లి పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు శ్మశాన వాటికలోని ఓ గదిపై దాడి చేయగా, మహిళ, విటుడు దొరికాడు.
నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ధనియాలగుట్ట శ్మశాన వాటిక నిర్వహణ ఇక నుంచి బేగంపేట సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయం నిర్వహణలో ఉంటుందని సర్కిల్ డీసీ డాకు నాయక్ తెలిపారు. శనివారం సిబ్బందితో కలిసి శ్మశాన వాటికను పరిశీలించారు. కొంత కాలం వరకు ఉన్న కాంట్రాక్టర్ వెళ్లిపోయారని తిరిగి..కొత్త కాంట్రాక్టర్ను నియమించి నిర్వహణ కొనసాగిస్తామని తెలిపారు.