సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో మరో రోడ్డును మోడల్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్ వైపు రోజు రోజుకు ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లను మరింత విశాలంగా, మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా ఖాజాగూడ జంక్షన్ నుంచి నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ వరకు ఉన్న రోడ్డును మోడల్ కారిడార్‌గా రూపొందించేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. సుమారు. రూ.9.45 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ మార్గంలో పలు పనులను చేపట్టనున్నారు. ప్రధానంగా ఖాజాగూడ క్రాస్ రోడ్డు నుంచి నానక్‌రాంగూడ రోటరీ వరకు ఎడమ వైపు సైకిల్ ట్రాక్, ఫుట్‌పాత్‌లను చేపడుతూ విశాలమైన రోడ్డును నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.9,45,56,180 వెచ్చించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ పనులను 45 రోజుల్లో పూర్తి చేసేలా కాలపరిమితిని విధించారు.
ఈ మార్గంలోనే ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను నిర్మిస్తుండటంతో ఈ పనులను వేగంగా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి నార్సింగి మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లను 4 వరుసలతో నిర్మిస్తుండగా, సోలార్‌రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా ప్రతిపాదించిన మోడల్ కారిడార్ దానితో అనుసంధానం కావడం వల్ల అటు వాహనదారులకు, ఇటు సైకిలిస్టులకు ఎంతో సౌకర్యవంతంగా మారుతుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్, రాయదుర్గం, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల నుంచి ఔటర్ రింగు రోడ్డు పైకి వెళ్లేందుకు ఖాజాగూడ-నానక్‌రాంగూడ రోడ్డు ఎంతో కీలకమైంది. నిత్యం వేలాది మంది గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌తో పాటు కోకాపేట, నార్సింగిలతో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు అనుకూలమైన రహదారిగా మారింది. ఇప్పటికే రాయదుర్గం నుంచి గచ్చిబౌలి మధ్య ఉన్న పాత ముంబాయి రహదారిని ఆధునీకరించి ఫ్లె ఓవర్‌ను ఏర్పాటు చేశారు.
ఇక రాయదుర్గం నుంచి ఖాజాగూడ మీదుగా నానక్‌రాంగూడ ఇంటర్చేంజ్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టినా… ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టలేదు. దీనికి తోడు బయోడైవర్సిటీ నుంచి ఖాజాగూడ లేక్మీదుగా కొత్తగా లింక్ రోడ్డు నుంచి ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద కలిసి ఈ మార్గాన్ని నిర్మించారు. దీంతో ఈ మార్గంలో మరింత ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఖాజాగూడ క్రాస్‌రోడ్డు నుంచి నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ రోటరీ వరకు అత్యాధునిక శైలిలో మోడల్ కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లను సైతం పిలిచారు. ఈ నెల 4వ తేదీ వరకు టెండర్ గడువు ఇవ్వగా, ఆ తర్వాత రోజు నుంచే కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేసి 45 రోజుల్లోనే పనులు చేపట్టేలా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు.