వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులకు ఎటువంటి విపత్తు రాకుండా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం తామున్నామని అభయమిస్తున్నది. 27 బృందాలతో 500 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉంటున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే చకచకా పరిష్కారాలు చూపుతూ పౌరుల మన్ననలు అందుకుంటోంది. మంగళవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 31 ఫిర్యాదులకు పరిష్కారాలు చూపారు. ఈ అత్యవసర సేవలను మరింత వేగంగా అందించేందుకు తాజాగా మొబైల్ కంట్రోల్ రూం (కస్టమైజ్డ్ ట్రక్)ను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 31లోపు ఆసక్తి గల ఏజెన్సీ నుంచి ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) సమర్పించాలని టెండర్లను ఆహ్వానించారు. మరోవైపు నగర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాబోయే రెండు రోజులు అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు భారీ వర్షాలకు నగరంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని, అత్యవసరమైతేనే సిబ్బందికి సెలవులు ఇవ్వాలని చెప్పారు. ఇదిలా ఉంటే జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతున్నది. హిమాయత్‌సాగర్‌లో నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతుండగా, ఉస్మాన్‌సాగర్‌లో గరిష్ట స్థాయి నీటి మట్టానికి ఇంకా రెండున్నర అడుగుల మేర నీరు రావాల్సి ఉన్నది.
సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): విపత్తు సమయాల్లో అద్భుత ప్రదర్శనతో ముందుండే ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ఎప్పటికప్పుడు మరింత బలోపేతం అవుతున్నది. ప్రస్తుతం 27 బృందాలతో 500 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటల పాటు నిత్యం ముఖ్యమైన ప్రదేశాల్లో అలర్ట్‌గా ఉంటూ విపత్తు నివారణ చర్యలు చేపడుతున్నది. అగ్నిప్రమాదం, వరదలు, గోడలు, పాత భవనాలు కూలిన సమయంలో అద్భుత పనితీరు కనబరిచి.. పౌరుల మన్ననలు అందుకుంటున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే సర్కిళ్ల వారీగా రాడార్లతో ప్రత్యేక వాతావరణ సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే తాజాగా మొబైల్ కంట్రోల్ రూం (కస్టమైజ్డ్ ట్రక్)ను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తి గల ఏజెన్సీ నుంచి ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) సమర్పించాలంటూ టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 31వ తేదీ వరకు టెండర్ తుది గడువు విధించారు.
అగ్ని ప్రమాదాలు, బిల్డింగ్లు కూలడం, వరదలు ఇతర దుర్ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఘటనా స్థలంలోనే ఎక్కువ సమయం ఉండి అత్యవసర సేవలందించాల్సినప్పుడు ఈ ట్రక్‌తో కూడిన మొబైల్ కంట్రోల్ రూం వినియోగించబడుతుంది. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ట్రక్‌లో ఏర్పాటు చేసిన డ్రోన్ల కనెక్టివిటి సహాయంతో పరిసర ప్రాంతాన్ని కంట్రోల్లోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు తగు సహాయక చర్యలు చేపట్టే వీలుంటుంది. ఈ తరహా ట్రక్ కంట్రోల్ రూంలు ఎయిర్‌పోర్టులో వినియోగిస్తారు. జీహెచ్ఎంసీ సమకూర్చుకునే ఈ కంటైనర్ వాహనంలో పది మంది అధికారులు కూర్చునే టేబుల్, టీవీలు, కంప్యూటర్లు, వైర్లెస్ రేడియోలు, కంటైనర్‌పై 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను రికార్డు చేసే వీడియో పరికరం, ఇతరత్రా పరికరాలు ఉంటాయి. వరదలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, శిథిల భవనాలు, ఇతర దుర్గఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుని సత్వర సహాయక చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల సమయాల్లో మంటల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు ఆరు అంబులెన్స్ సేవలను అవసరమైనప్పుడు ఉపయోగించుకునేలా ప్రైవేట్ సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకోనున్నది.