సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణికుల ఇబ్బందులు చిక్కుముడి ఎప్పటికీ వీడటం లేదు. మెట్రో దిగితే ఇంటికి ఎలా వెళ్లాలి..? స్టేషన్ నుంచి కాలనీలకు చేరుకోవడం ఎలా? అనే లాస్ట్ మైల్ కనెక్టవిటీ సమస్య ఏళ్ల తరబడి వేధిస్తూనే ఉంది. తాజాగా ఫీడర్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధం అవుతుండగా, కనీసం ఈసారైనా లాస్ట్ మైల్ కనెక్టవిటీకి మోక్షం దొరుకుతుందా? అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెట్రో స్టేషన్ నుంచి బయటకు రాగానే, గమ్యస్థానానికి చేరుకోవడమే అతి పెద్ద టాస్క్‌గా మారింది. అయితే వాకింగ్, లేదా ఆటోలు, క్యాబులను ఆశ్రయించడమో చేయాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేషన్ల దగ్గర బస్టాఫ్లూ లేకపోవడంతో, ఉన్న కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మహిళలు, వృద్ధులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు ఆర్టీసీతో కలిసి తాజాగా మెట్రో సన్నాహాలు చేస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా కాలనీలకు మినీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
అటకెక్కిన గత ప్రతిపాదనలు…
బీఆర్ఎస్ హయాంలో లాస్ట్ మైల్ కనెక్టవిటీకి మధ్య దూరాన్ని తగ్గించేందుకు సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఈ క్రమంలో ఐటీ కారిడార్, ఉప్పల్, ఎల్బీ నగర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ర్యాపిడో, ఎలక్ట్రిక్ ఆటోలు, సైకిళ్లు ప్రారంభించింది. దాదాపు రెండేండ్ల పాటు సమర్థవంతంగా నిర్వహించింది. కానీ ఆ తర్వాత ప్రణాళికబద్ధంగా అమలు చేయడంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టలేదు. ఎంత సేపు నగరంలో మెట్రో విస్తరణ పేరిట హడావుడి చేయడమే తప్పా… రెండేళ్ల కాలంలో ఒక్క అడుగు అదనంగా మెట్రోను అందుబాటులోకి తీసుకురాలేదు. కనీసం ప్రయాణికుల రద్దీ ఎప్పుడూ? ఏ రూట్లో ఎక్కువ రద్దీ ఉందీ? ఫీడర్ సర్వీసులతో ఎంత మందికి ప్రయోజనం ఉంటుందనే విషయాలపై కనీసం అధ్యయనం కూడా చేయడం లేదు.
బస్తీలతో కాని అనుసంధానం..
కాగా, నగరవాసులకు మెరుగైన రవాణా అందాలంటే కేవలం మెట్రో రైళ్లు ఉంటే సరిపోదు. వాటిని కాలనీలు, బస్తీలతో అనుసంధానం చేసే బలమైన రవాణా వ్యవస్థ అవసరం. దీనికి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, బైకులు వంటివి అందుబాటులోకి వస్తే అందుబాటులో ధరల్లోనే రవాణా సదుపాయాలతో ప్రయాణికులకు రవాణా ఛార్జీల భారం తగ్గుతుంది. దీంతోపాటు మెట్రో దిగిన వెంటనే కనెక్టివిటీ పెరిగి, ప్రయాణికుల సమయం కూడా ఆదా అవుతుంది.