GHMC | సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో బల్దియా యంత్రాంగం అడ్డదార్లు తొక్కుతున్నది. నిబంధనలను నీళ్లొదిలి ప్రజలపై పన్ను భారం మోపుతున్నది. బల్దియాకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నును ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండానే సవరణలు చేస్తున్నది. ఇందుకు విద్యుత్‌శాఖ బిల్లులు, సబ్ రిజిస్ట్రార్లను పావుగా వాడుకుంటున్నది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో పోల్చితే పన్ను వసూలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో అడ్డదార్లు తొక్కైనా సరే.. ఆదాయాన్ని పెంచుకునే దిశగా పావులు కదిపి అమలు చేస్తున్నది.
నూతనంగా కొనుగోలు చేస్తున్న ఖాళీ స్థలం నుంచి ఇండ్లు, అపార్ట్ మెంట్లోని ఫ్లాట్ వరకు రిజిస్ట్రేషన్ చేస్తూనే ఆస్తిపన్ను సైతం అసెస్మెంట్ చేస్తున్నారు. రిజిస్ట్రార్ అంతేకాదు స్టాండింగ్ కమిటీ నుంచి ఎటువంటి తీర్మానం, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఆస్తిపన్నును పెంచేశారు. ఒక మాటలో చెప్పాలంటే బల్దియా అప్రకటిత ఆస్తిపెంపు నిర్ణయాన్ని అమలు చేస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు. అప్పుల ఊబి నుంచి జీహెచ్ఎంసీని బయటపడేసేందుకు తమపై భారం మోపుతారా అంటూ.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలు ఉండగా, వీటిలో రెసిడెన్షియల్ 16.35 లక్షలు, నాన్ రెసిడెన్షియల్ 2.80 లక్షలు, మిక్డ్స్ 34వేల వరకు ఉన్నాయి. వీటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దాదాపు రూ.1224 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేశారు. ఈ ఏడాది రూ. 2,400 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. టార్గెట్ చేరుకోవడానికి ప్రస్తుతం రూ.101 ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలకు రేట్లను సవరించి పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పెంచిన పన్నునే వసూలు చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు పన్ను నెట్ వర్ లేని వాటిని గుర్తించడానికి డ్రోన్ సర్వే చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు చందానగర్, మియాపూర్, ఇతర ప్రాంతాల్లో 14వేల ప్రాపర్టీలను సర్వే చేశారు. వీటితోపాటు బిల్డింగ్ పర్మిషన్, ఆక్యూపెన్సీ, తాజాగా ఆస్తిపన్ను చెల్లించిన రశీదు, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, ట్రేడ్ లైసెన్స్, ఓనర్ వివరాలు సేకరిస్తున్నారు. వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు ఆధారంగా రెసిడెన్షియల్ కేటిగిరీలో పన్ను చెల్లిస్తున్నారా? కమర్షియల్ కేటగిరీలో చెల్లిస్తున్నారా? అనే అంశాన్ని పరిశీలించి పన్ను పెంచుతున్నారు. ముఖ్యంగా నివాస కేటగిరీలో పన్ను చెల్లిస్తున్న 50వేల నిర్మాణాలకు వాణిజ్య కోటా విద్యుత్ సరఫరా అవుతున్నట్లు తేలింది.
చదరపు అడుగుకు 60 పైసలు, 80 పైసల చొప్పున పన్ను చెల్లించే కట్టడాలకు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు సుమోటోగా నోటీసులు జారీని ప్రారంభించారు. నాలుగు కేటగిరీల్లోని రెండు లక్షల నిర్మాణాలను సర్వే చేస్తే..మొత్తంగా రూ. 50కోట్ల మేర ఆదాయం పెరగవచ్చని అధికారుల అంచనా వేశారు. అయితే ఆస్తిపన్ను పెంచాలంటే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఉత్తర్వులు ఇవ్వాల్సిందేనని ఓ అధికారి తెలిపారు. కానీ ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేయకుండానే ఆస్తిపన్ను ఎలా పెంచుతారని పలువురు కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అప్రకటిత ఆస్తిపన్ను నిర్ణయాన్ని వచ్చే కౌన్సిల్లో నిలదీస్తామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు.