Property Tax | సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందంగా ‘ఇందిరమ్మ ఇండ్ల సర్వే’ బల్దియాకు సరికొత్త తంటాను తెచ్చిపెట్టింది. సంస్థకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లపై ఈ సర్వే ప్రభావం పడుతున్నది. ప్రభుత్వం గడిచిన కొన్ని నెలలుగా ఆస్తిపన్ను వసూళ్లలో కీలకమైన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు వరుసగా వస్తున్న సర్వే అదనపు భారం పడుతున్నది. వీరు ఒక పక్క సర్వేలు, మరో పక్క ట్యాక్స్ వసూలు పనులు చేయాల్సి ఉంది.
సర్వే కారణంగా ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కావడం లేదని చెబుతున్నారు. గడిచిన రెండు, మూడు నెలలుగా నెలవారీగా ఆస్తిపన్ను రూ. 50కోట్లు దాటడం లేదని అధికారులు చెబుతున్నారు. వసూళ్లు తగ్గడంతో సంస్థ ఖజానాపై తీవ్ర ప్రభావం పడి.. నెలవారీ వేతనాలు సకాలంలో అందలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేతో ఆస్తిపన్ను వసూళ్లు సరిగా లేకపోవడం, రాబోయే రోజుల్లో 26వ తేదీ నుంచి రేషన్ కార్డుల సర్వే, అనంతరం పింఛన్ల సర్వే, గృహలక్ష్మి సర్వే కూడా చేయాల్సి వస్తుందన్నారు.
మొత్తం 19.49 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ. 1407 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. 12 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లించారు. మార్చి 31 నాటికి రూ. 563 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అత్యధికంగా శేరిలింగంపల్లి, చందానగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ప్రధానంగా దృష్టి సారించారు. దాదాపు ఆరు లక్షల మందికి వైట్ నోటీసులు జారీ చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలల 20 రోజుల సమయం ఉంది. ఈ ఏడాది టార్గెట్ రూ.1970 కోట్లలో ఇంకా రూ. 563 కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది. మార్చి 31 వరకు లక్ష్యాలను చేరుకోవాలని సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే నిర్ణీత సమయంలో ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం చేరడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జీహెచ్ఎంసీలో నయా దందా మొదలైంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులే లక్ష్యంగా అక్రమ వసూళ్లకు తెరలేపారు. గడిచిన కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ జోనల్, సర్కిల్ అన్ని కార్యాలయాల్లోని ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఆపరేటర్లకు జీతం పెంచుతామని కొందరు కాల్స్ చేస్తున్నారు. 625 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను దగ్గర పెట్టుకుని జీతం పెంచుతాం, అందుకు నుంచి రూ. వెయ్యి నుంచి రెండు వేల వరకు రేటును ఖరారు చేశామని చెబుతూ.. గూగుల్ పే నంబర్ పంపుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు.
జీతం పెరిగిన తర్వాత రెండు నెలల జీతం ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఇప్పటికే డబ్బులు సమర్పించుకోగా, మరికొందరు సందిగ్ధంలో ఉన్నామని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వసూళ్ల దందాలో నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుచరులు ఉన్నారని, ఓ మహిళా నేత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అడ్మిన్ విభాగంలో కొందరి ప్రమేయంలో ఇటువంటివి చేస్తున్నారని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాఫిక్‌గా మారింది.