కాప్రా, మార్చి 28: ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ (OTS) పథకం మూడు రోజుల్లో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో ఆది, సోమవారాలు ఉగాది, రంజాన్ పండుగలు కావడం వల్ల ఆస్తి పన్ను వసూలు సజావుగా జరగకపోవచ్చు. అయితే ఈ పండుగ రోజుల్లో కూడా ఆస్తి పన్ను వసూలు చేసేందుకు అధికారులు, సిబ్బందిని జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో కూడా ఆస్తి పన్ను చెల్లింపుల కోసం కౌంటర్లు తెరిచే ఉంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది విధులకు హాజరై పన్ను వసూలు చేస్తారని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డీ. జగన్ తెలిపారు.
ఇంటి యజమానులు తమ పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని, వడ్డీపై 90 శాతం రాయితీ పొందాలని సూచించారు. ఈ నెలాఖరుకల్లా ఆస్తి పన్ను వసూలు లక్ష్యాన్ని తప్పక సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. 2024- 2025 ఏడాదికి సంబంధించి ఆస్తిపన్ను వసూలు టార్గెట్ రూ.61.18 కోట్లు కాగా.. గురువారం నాటికి మొత్తం రూ.55.32 కోట్ల ఆస్తిపన్ను వసూలు అయిందన్నారు. మరో రూ.5.86 కోట్ల మేర పన్ను వసూలు కావలసి ఉందని తెలిపారు. పండుగ రోజుల్లో కూడా సర్కిల్ కార్యాలయంలో ఆస్తిపన్ను కౌంటర్లు తెరిచి ఉంటాయని, సర్కిల్ పరిధిలోని గృహాలు, వాణిజ్య సంస్థలకు సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించి వడ్డీపై రాయితీ పొందాలన్నారు.