సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో కొందరు అధికారుల నిర్వాకం వల్ల లిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తి ఏకంగా హెల్త్ ఇన్స్పెక్టర్ అయ్యారు. అర్హత లేకున్నా, నిబంధనల విరుద్ధంగా వచ్చిన పదోన్నతిపై వివరాల్లోకి వెళితే.. కోటేశ్వర్రావు అనే ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి గతంలో ఒక కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్గా పనిచేశాడు. కొంత కాలం తరువాత ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నిలోఫర్‌లో లిఫ్ట్ ఆపరేటర్‌గా చేరాడు. కొన్ని రోజుల తరువాత అతన్ని ఓపీ రిజిస్ట్రేషన్ విభాగంలో నియమించారు.
పెద్దగా విద్యార్హతలు లేని సదరు వ్యక్తి రోగుల వివరాలను సరిగ్గా నమోదు చేయలేకపోవడంతో అక్కడి నుంచి తప్పించి, మూడు నెలల క్రితం ఏకంగా దవాఖానలో హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్టును కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం ఔట్సోర్సింగ్ సిబ్బందిని హెల్త్ ఇన్స్పెక్టర్గా నియమించకూడదు. తప్పని పరిస్థితుల్లో నియమించాల్సి వస్తే అర్హులైన వారిని ఎంపిక చేయాలి. కానీ లిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తిని హెల్త్ ఇన్స్పెక్టర్ నియమించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగికి హెల్త్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు అప్పగించడం కరెక్ట్ కాదు. కోటేశ్వర్‌రావును విధుల నుంచి తప్పించాలని ఆర్‌ఎంవోను ఆదేశించాం. ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతులతో నిలోఫర్‌లో హెచ్ఐ(హెల్త్ ఇన్స్పెక్టర్లు)కొరత ఏర్పడింది. హాస్పిటల్లో సామర్థ్యానికి మించి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అత్యవసరమైనప్పుడు మాత్రమే ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించుకుంటాం. కానీ కీలక బాధ్యతలు అప్పగించం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవు.
– డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్