బంజారాహిల్స్, అక్టోబర్ 19: జూబ్లీహిల్స్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, మెదక్ జిల్లాకు చెందిన బీజేపీ నేత బీ.హనుమంతు (52) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నివాసం ఉంటున్న హనుమంతు నగరంలోని పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సుపరిచితుడు. జూబ్లీహిల్స్ సొసైటీ, ఎమ్మెల్యే కాలనీ సొసైటీలతో పాటు శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కీలకపాత్ర పోషించిన హనుమంతుకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య శోభ తన కొడుకు దత్తుతో కలిసి కొండాపూర్‌లో నివాసం ఉండగా, రెండో భార్య సంగమ్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటారు.
ఇదిలా ఉండగా 2016లో అనిత అనే మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడగా పలుమార్లు గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నెలరోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని రెండోభార్య నివాసంలో ఉన్న హనుమంతు వద్దకు వచ్చిన అనిత న్యూసెన్స్‌కు పాల్పడడంతో పాటు గొడవకు దిగింది. తనతో సహజీవనం చేసి ముఖం చాటేశావని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గొంతు కోశావంటూ అనిత వాగ్వాదానికి దిగడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించింది. అప్పటినుంచి తన తండ్రి హనుమంతు ఫోన్ స్విచ్చాఫ్ ఉందని, అనిత వ్యవహారంలో ఎన్నో ఏళ్లుగా డిఫ్రెషన్‌తో ఉన్నాడని, నెలరోజులుగా ఇంటికి రావడం లేదని, అతడి ఆచూకీ సైతం తెలియడం లేదని రెండ్రోజుల క్రితం కొడుకు దత్తు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.