సిటీబ్యూరో: ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా ప్రొఫెసర్ పలుకూరి లక్ష్మి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో 2000 నుంచి 2005 వరకు ప్లాస్టిక్ సర్జరీలో పీజీ పూర్తి చేసిన ఆమె 2005 ఆగస్టులో అదే దవాఖానలో ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2010లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2017లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2020 అక్టోబర్‌లో ప్లాస్టిక్ సర్జరీ విభాగం తొలి మహిళా అధిపతిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. 2022 అక్టోబర్ వరకు ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతిగా విధులు నిర్వర్తించిన లక్ష్మి రెండోసారి ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.
గతంలో హెచ్వోడీగా పనిచేసిన సమయంలో జాతీయ స్థాయి అవగాహన సదస్సులు, ఇయర్ రీ కన్స్ట్రక్షన్ హ్యాండ్స్ ఆన్ వర్క్‌షాప్, బర్న్స్లో జాతీయ స్థాయి మిడ్‌టర్మ్ కాన్ఫరెన్స్‌లు, ప్లాస్టిక్ సర్జరీ పీజీలకు జాతీయ స్థాయిలో ఆన్లైన్ ప్లాస్టిక్వేస్ట్పై శిక్షణ కార్యక్రమాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన డా.లక్ష్మి తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా ‘ఎథికాన్ గంగా’ ఫెలోషిప్‌ను పొందారు. జాతీయ బర్న్స్ అసోసియేషన్, నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ అసోసియేషన్లకు ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. రెండోసారి ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డా.లక్ష్మీ పలుకూరి మాట్లాడుతూ వైద్యరంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్సా పద్ధతుల్లో భాగంగా ‘ప్లాస్టిక్ సర్జరీ’ విభాగంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు.
ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ అనేది కేవలం కాలిన గాయాలకు గురైన వారికే కాకుండా క్యాన్సర్ రోగులు, రోడ్డు ప్రమాదాలకు గురైన వారు, ఇతర ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి అవయవాల పునర్నిర్మాణ చికిత్సలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రోగికి కొత్త రూపంతో పాటు కొత్త జీవితాన్ని ప్లాస్టిక్ సర్జరీ విభాగం అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆధునిక చికిత్సా పద్ధతులపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. కాగా ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టిన డా.లక్ష్మికి పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.