ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 7: తెలంగాణ సమాజానికే గద్దర్ ఒక చైతన్య స్ఫూర్తి అని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు పాటుపడ్డారని కొనియాడారు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ప్రజా యుద్ధనౌక గద్దర్, ప్రజా జర్నలిస్టు జహీర్ అలీఖాన్ యాదిలో ప్రథమ వర్ధంతి సభను బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, సాంస్కృతిక కళా రంగాలను సంపూర్ణంగా విశ్లేషించి, ప్రజలకు అందించిన మహానుభావుడు గద్దర్ అని కీర్తించారు. గద్దర్ పాటలు ఆ రోజుల్లో ఎంతో మందిని ప్రభావితం చేసి, ప్రజా యుద్ధం వైపు మళ్లించాయని చెప్పారు. ఆయన అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మోసమనే ఆధిపత్యానికి గద్దర్ పాట ఎదురు నిలిచిందని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులపై అనేక పాటలు అల్లారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ గద్దర్ జీవితం బాల కార్మికుడిగా మొదలై బ్యాంకు ఉద్యోగిగా మారి, బుర్రకథ కళాకారునిగా కొనసాగిందన్నారు. ఆ ప్రస్థానం జన నాట్య మండలికి మారి, విప్లవానికి అంకితమైందని చెప్పారు. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చాడని ఆయన అభిప్రాయపడ్డారు. అట్టడుగువర్గాల భాషను విప్లవ సాహిత్యంలోకి ప్రవేశపెట్టింది గద్దరేనని పేర్కొన్నారు. అనంతరం, ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడారు. కార్యక్రమంలో గద్దర్ కూతురు వెన్నెల, కుమారుడు క్రాంతి, ప్రొఫెసర్ అన్సారీ, ప్రొఫెసర్ యాదగిరితో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఓయూలో ఘనంగా గద్దర్ వర్ధంతి
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 7: ప్రజా యుద్ధనౌక గద్దర్ సమ సమాజ స్థాపన కోసం ఎంతో పరితపించారని పలువరు వక్తలు కొనియాడారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు. ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) ఓయూ అధ్యక్షుడు నామ సైదులు ఆధ్వర్యంలో గద్దర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గద్దర్ తన జీవితాంతం దోపిడీ, పీడన, అణిచివేతలకు వ్యతిరేకంగా తన మాట, పాటలతో ప్రజలను చైతన్యం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీలో గద్దర్ పేరుతో సాహిత్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్, విద్యార్థి నాయకులు మహేశ్, తరుణ్, కార్తీక్, క్రాంతి, శివ పాల్గొన్నారు.