సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాజధాని నగరంలో ప్రధాన కూడళ్లు, మార్గాల్లో సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం, ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్) ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ ప్రాజెక్టుపై న్యాయపరమైన చిక్కుల్లో ఉండడం, ఆగమేఘాల మీద టెండర్లు పిలిచిన అధికారులు భూ సేకరణపై స్పష్టత లేకపోవడంతో టెండర్ కమిటీ సైతం సంబంధిత టెండర్‌ను ఫైనల్ చేయలేక రోజుల తరబడి కాలయాపన చేస్తోంది.
ఇదే సమయంలో పాతబస్తీలో హెచ్ సిటీ ప్రాజెక్టుల కింద పలుచోట్ల రహదారుల అభివృద్ధికిగానూ శ్రీకారం చుట్టింది. అయితే ఏడాది కాలంగా హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ప్రాజెక్టులో భాగంగా పలుచోట్ల భూ సేకరణ అధికారులకు సవాల్‌గా మారింది. 1,391 చోట్ల ఆస్తులను గుర్తించగా.. భూ సేకరణకు క్షేత్రస్థాయిలో వెళ్లిన అధికారులకు బాధితుల నుంచి చుక్కెదురు అవుతున్నది. చాలా వరకు చిన్న చిన్న ప్రాపర్టీలు పోతుండటంతో బాధితులంతా టీడీఆర్‌లకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. నగదు రూపంలో నష్ట పరిహారం అందజేస్తేనే రహదారి విస్తరణ పనులకు సహకరిస్తామని తేల్చి చెబుతున్నారు. అసలే ఆర్థిక కష్టాల్లో మూలుగుతున్న బల్డియాకు ప్రభుత్వ నుంచి నిధులు మంజూరు జరగకపోవడం, ప్రాజెక్టు పనులు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మొత్తంగా పాతబస్తీలో భూ సేకరణ కష్ట సాధ్యంగా మారడంతో హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితులు కనబడటం లేదని స్వయంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతుండటంతో స్పెషల్ ఫండ్ కింద పాత నగరంలో భూ పరిహార బాధితులకు ప్రభుత్వం నుంచే నష్ట పరిహారం అందజేస్తూ వస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఆలస్యంగా వస్తుండటంతో ఆస్తుల సేకరణ సందిగ్ధంలో పడింది.