హెచ్ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టులకు భూసేకరణ క్లిష్టంగా మారింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి భూములు సేకరించడం తలకు మించిన భారంగా మారుతుంది. ఇప్పటివరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోను ఇదే తరహా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో పరిహారం, ప్రాజెక్టు విస్తరణ అంశంలో స్పష్టతనివ్వడం లేదు. దీంతోనే జేబీఎస్ – శామీర్‌పేట్ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ఏడాది పాటు వాయిదా పడగా.. ఇప్పుడు కొత్తగా ప్యారడైజ్-సుచిత్ర మార్గంలోనూ ఇబ్బందులు మొదలయ్యాయి.
సిటీబ్యూరో, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం మార్గంలో దాదాపు ఐదున్నర కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును హెచ్ఎండీఏ చేపట్టింది. అయితే ఇటీవలే సాయిల్ టెస్ట్ నిర్వహించి, గుంతలు తీసే పనులు మొదలుపెట్టారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదు. ఈ మార్గంలో మొత్తం 60కి పైగా ఆస్తులను సేకరించాల్సి ఉండగా..ఇందులో రక్షణ శాఖ ఆస్తులు పోను మిగిలిన 23 ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి భూమిని సేకరించే అంశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందులో కొన్ని ఇతర మతాలకు చెందిన శ్మశాన వాటికలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్‌కు భూములు ఇచ్చే విషయంలో సంబంధిత ఆస్తుల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్ఎండీఏను కూడా ఆశ్రయించారు. కానీ ఇప్పటివరకు భూములు ఇచ్చే విషయంలో హెచ్ఎండీఏకు కొరకరాని కొయ్యలుగా మారారు.
భూ సేకరణ పరిహారంపై స్పష్టత కరువు
రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు భూసేకరణ అంశమే కీలకంగా మారింది. రక్షణ శాఖ కోల్పోతున్న భూములకు ఇచ్చే పరిహారంపై స్పష్టత ఉన్నట్లుగా… ప్రైవేటు ఆస్తుల విషయంలో ప్రభుత్వం పరిహారాన్ని ఇప్పటికీ తేల్చలేదు. దీంతోనే వందలాది మంది భూ యజమానులు కోర్టులను ఆశ్రయించి, తమ ఆస్తులకు రక్షణ కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పరిహారం, ప్రాజెక్టు వెడల్పు అంశంలో స్థానికులకు ఉన్న అభ్యంతరాలను తొలగించకుండా భూసేకరణకు సిద్ధపడి, జేబీఎస్ మార్గంలో బోల్తా పడింది. ఇక మిగిలిన ప్యారడైజ్ మార్గంలోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తే మిగిలిన ఆస్తుల సేకరణ జఠిలమైతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.