చిక్కడపల్లి, జనవరి 13 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 72తో రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం సంఘం(టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీశ్ అన్నారు. 2023-2024 సంవత్సరానికి ఈ జీవో ద్వారా అఫిలియేషన్ సాధించిన సందర్భంగా టీపీజేఎంఏ రాష్ట్ర నాయకత్వానికి శుక్రవారం ఆ సంఘం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ మాట్లాడుతూ.. జీవో రావడానికి కృషి చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా జీవో నం.112 ప్రకారం ఏటా 10శాతం చొప్పున ట్యూషన్ ఫీజులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు వరదారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, కోర్ కమిటీ సభ్యులు బాలకృష్ణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్వర్ధన్రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.