సిటీబ్యూరో: ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 18 లక్షలు పొగొట్టుకున్నాడు. యాప్రాల్‌కు చెందిన బాధితుడు ఫేస్బుక్ అప్లికేషన్ చూస్తుండగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్రకటనను క్లిక్ చేయడంతో ఎం55 పైసా కెపిటల్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌నకు కనెక్ట్ అయ్యింది. అడ్మిన్ గౌరవ్ సేత్ అనే వ్యక్తి బాధితుడికి ఫోన్ చేసి మా దగ్గర ట్రేడింగ్‌లో చేరండి, మీకు మంచి లాభాలిప్పిస్తామంటూ నమ్మించారు. ఖాతాను తెరిపించారు.
ఓ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేయించి, అందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని సూచించారు. మొదట రూ. 9 వేలు ఇన్వెస్ట్ చేయడంతో కొన్ని లాభాలు చూపించారు. ఆ తరువాత నెమ్మదిగా పెట్టుబడి మొత్తాన్ని పెంచుతూ లాభం వచ్చిందంటూ స్క్రీన్‌పై చూపిస్తూ వెళ్లారు. ఆ తరువాత ఐపీఓలో పెట్టుబడి పెట్టాలని మరిన్ని లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ దఫ దఫాలుగా రూ. 18.38 లక్షలు పెట్టుబడి పెట్టించారు. స్క్రీన్‌పై లాభాలు కోట్లల్లో కన్పిస్తున్నా వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు ఇదంతా మోసమని గుర్తించి.. రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.