సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉచితంగా ఉండే పబ్లిక్ టాయిలెట్లు ఇక మీదట ప్రైవేట్ పరం కానున్నాయి. ఎవరికైతే అర్జెంట్ వస్తే డబ్బులు పెట్టి రిలీఫ్ పొందాల్సిందే.. ఉచిత సదుపాయంతో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను చూడాల్సిన జీహెచ్ఎంసీ చేతులెత్తేసింది. పరిశుభ్రంగా ఉండవని భావించిన జీహెచ్ఎంసీ వాటిని ప్రైవేట్‌కు నిర్వహణ ఇచ్చేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. రీయూజ్ చేసేందుకు రీ డిజైన్, రీఫర్బిష్తో ముందుకొచ్చే సంస్థలకే పే అండ్ యూజ్ విధానంలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని బల్దియా భావిస్తున్నది.
ప్రయోగాత్మ కంగా ఒక జోన్లో ఈ విధానాన్ని అమ లు చేసి, ఫలితాలను బట్టి అన్ని జోన్లతో అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నేడు మేయర్ అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల నుంచి ఆమోదం తీసుకోనున్నారు. వెంటనే గ్రేటర్లో నిరుపయోగంలో ఉన్న టాయిలెట్లను ప్రైవేట్‌పరం చేసి జీహెచ్ఎంసీ చేతులు దులుపుకోనున్నది. నిర్వహణ పేరిట సదరు ఏజెన్సీ ఇష్టారాజ్యంగా రేట్లు పెట్టి కస్టమర్ల అర్జెంట్ను అసరాగా చేసుకునే వీలు లేకపోలేదు.
బీఆర్ఎస్ హయాంలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ఫ్లస్ ఫ్లస్) నగరంగా హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చారు. అప్పుడు ఇదే అధికారులు సమర్థవంతంగా టాయిలెట్లను నిర్వహణను నిర్వర్తించగా, ప్రజాపాలన ప్రభుత్వంలో అన్నీ ప్రైవేట్ బాటలు పర్చుకుంటుండడం పాలన వైఫల్యానికి అద్దం పడుతున్నది.
జీహెచ్ఎంసీలో దాదాపు 2,200 పబ్లిక్ టాయిలెట్లు ఉండగా, వీటిలో 1370 తలుపులు ఊడి, డ్రైనేజీ నీటి సదుపాయాల్లేక వినియోగంలో లేవు. వీటిని ప్రస్తుతం ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. టాయిలెట్ల క్షేత్రస్థాయిలో లేకున్నా వాటి పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారు. పబ్లిక్ టాయిలెట్లలో సగానికి పైగా వినియోగంలో లేకపోవడం, కొన్ని చోట్ల గాయబ్ అయ్యాయని, బిల్లులు చెల్లింపులు మాత్రం యథావిధిగా జరుపుతున్నారన్న ఆరోపణలు ఇటీవల అనేకంగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఉచిత టాయిలెట్ల నిర్వహణ సంస్థతో సాధ్యం కాదని తేల్చారు. ఈ నేపథ్యంలోనే ‘పే అండ్ యూజ్’ విధానాన్ని అధికారులు తెరపైకి తీసుకురావడం గమనార్హం.