బంజారాహిల్స్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఉపయోగించుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు సూచించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అర్చకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ.. అర్చకుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. పెన్షన్ సదుపాయం, వైద్యం కోసం ఆర్థిక సాయం, ఇంటి నిర్మాణానికి రుణాలు,ఉపాధి పథకాలు తదితర పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ పథకాల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు అన్ని జిల్లాల్లో అర్చక సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్‌రావు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్చక సంఘం నేతలు రవీంద్రాచార్యులు, చంద్రశేఖరశర్మ, సత్యనారాయణశర్మ, కృష్ణమాచార్యులు, భద్రీనాథాచార్యులు, మురళీధరశర్మతో పాటు ఆలయ ఈవో శ్రీనివాసశర్మ, వివిధ ప్రాంతాలకు చెందిన ఏడీసీలు, ఆర్జేసీలు, సహాయ కమిషనర్లు, ఈవోలు పాల్గొన్నారు.