సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అర్చక మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ సభ్యుల సమావేశం బుధవారం ఉదయం 11గంటలకు సెక్రటరియేట్‌లోని రెవెన్యూ మీటింగ్‌హాల్‌లో జరగనున్నట్లు దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సమావేశానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ వామనరావు, ఎండోమెంట్ రెవెన్యూ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్, బోర్డు సెక్రటరీ కమ్ ట్రెజరర్, దేవాదాయశాఖ కమిషనర్ ఎస్ వెంకటరావు, టీటీడీఈవో, ముగ్గురు వెల్ఫేర్ బోర్డు సభ్యులు జక్కాపురం నారాయణస్వామి, చిలుకమర్రి శ్రవణకుమారాచార్యులు, కాండూరి కృష్ణమాచార్యులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో అర్చక ఉద్యోగుల సంక్షేమానికి వినియోగించిన నిధులు, ట్రస్ట్ విధులు, ప్రస్తుతం ఉన్న పథకాలు, ట్రస్ట్‌లో ఉన్న నిధుల ప్రస్తుత పరిస్థితి, గత సమావేశంలో చేసిన తీర్మానాలపై తీసుకున్న చర్యలు, రిటైర్మెంట్ ఇతర సంక్షేమానికి సంబంధించి చర్చ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు బోర్డు సభ్యుల ప్రమేయం లేకుండానే దేవాదాయ అధికారులు కార్యక్రమాలు నిర్వహించడం, అసలు బోర్డు సభ్యుల తీర్మానం లేకుండానే బిల్లులు తీసుకోవడంపై సభ్యులు, అర్చకులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన ఉగాది వేడుకలలోచోటుచేసుకున్న అపశృతులు, అందుకు వినియోగించిన డబ్బులతోపాటు ఈ సంవత్సరం అర్చకుల సంక్షేమానికి సంబంధించి నామమాత్రంగా నిధుల కేటాయింపుపై సభ్యులు చర్చించనున్నట్లు తెలిసింది. దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులకు గ్రాట్యుటీతో పాటు కాంట్రిబ్యూటరీ పెన్షనరీ బెనిఫిట్స్‌పై ఈ సమావేశంలో చర్చించాలని తెలంగాణ దేవాదాయ అర్చక ఉద్యోగ జేఏసీ కోరింది. దేవాదాయ ఉద్యోగులకు సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అన్ని బెనిఫిట్స్ కల్పించేలా తీర్మానం చేయాలని జేఏసీ ప్రతినిధులు ఉపేంద్రశర్మ, వీ రామ్మోహన్రావు కోరారు.
రాష్ట్రంలో అర్చకుల సంక్షేమానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అర్చక వెల్ఫేర్ ట్రస్ట్‌కు రూ.230 కోట్లు కేటాయించారు. అర్చకుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. ఈ సంవత్సరం మార్చి 31వరకు 246.14కోట్లు అర్చక సంక్షేమనిధి ఎఫ్‌డీఆర్‌లు ఉన్నట్లు, ఇవి కాక మరో రూ.1.04 కోట్ల నిధులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతీ సంవత్సరం అర్చక సంక్షేమ నిధికి వడ్డీతో పాటు రాష్ట్రంలోని పలు ఆలయాల ఆదాయం నుంచి 5శాతం చొప్పున వివిధ రూపాల్లో రూ.15కోట్ల ఆదాయం వస్తుంది. గత సంవత్సర కాలంగా ఇందులో కేవలం 144 కార్యక్రమాల పేరుతో రూ.3.46కోట్లు మాత్రమే కేటాయించారు. ఎప్పటికప్పుడు అర్చకులకు సంబంధించిన సంక్షేమ విషయంలో అధికారులు పెద్దగా దృష్టి పెట్టకపోగా వచ్చిన దరఖాస్తులను కూడా పట్టించుకోలేదని అర్చక ఉద్యోగ సంఘ ప్రతినిధులు చెప్పారు.