సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి : అవగాహనతోనే రొమ్ము క్యాన్సర్ మహమ్మారిని నివారించవచ్చని విశ్రాంత ఐఏఎస్ అధికారి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మనాభయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ నివారణపై ఆదివారం రవీంద్ర భారతిలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ పద్మనాభయ్య మాట్లాడుతూ.. మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే అంతకు మనుపటి జీవనశైలిని కొనసాగించాలని సూచించారు.
భవిష్యత్తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిపౌరుడు మంచి ఆహారం, సరైన నిద్ర, సరైన జీవనశైలిని నిర్దేశించుకోవాలని కోరారు. కిమ్స్ ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పి.రఘురాం మాట్లాడుతూ.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడం వల్ల ప్రతి ఏటా దేశవ్యాప్తంగా 2 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రొమ్ము ఎక్స్ రే తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ మహమ్మరిని నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లోని మహిళలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహించామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యూట్యూబర్ గంగవ్వ, ఉషాలక్ష్మి, డాక్టర్లు పాల్గొన్నారు.