సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : వచ్చే వర్షాకాలంలో వరద ముంపు నివారణకు జోనల్ వారీగా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సీడీఎంఏ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, జోనల్ కమిషనర్లు, ఈఎన్సీ జియావుద్దీన్‌తో కలిసి మాన్సూన్ ప్రిపరేషన్‌పై దానకిశోర్ సమీక్షించారు.
జీహెచ్ఎంసీ ఏరియాలో వర్షాకాలంలో ముంపునకు గురయ్యే కాలనీల వివరాలు, ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు, అవసరమైన నిధులు కూడా జోన్ల వారీగా సిద్ధం చేయాలన్నారు. మ్యాన్‌హోల్స్, క్యాచ్ఫిట్ ఏరియాలో వరదలతో ప్రమాదాలు జరగకుండా ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పారు. వానకాలం నాటికి నాలా పూడికతీత పనులను పూర్తి చేయాలన్నారు. జీహెచ్ఎంసీకి చుట్టూ పక్కల మున్సిపాలిటీలలో కూడా ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అలాగే రెండో దశ ఎస్ఎన్డీపీ పనులు చేపట్టేదుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని ఈఎన్సీని దానకిశోర్ ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్ మేజర్ 101, మీడియం 127, మైనర్ 92 కాగా, ఈ పాయింట్లను రోడ్‌మ్యాప్ గుర్తించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పనికిరాని బోర్‌వెల్స్‌ను గుర్తించాలని, ప్రమాదాలు సంభవించకుండా సైన్‌బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. స్మార్ట్ వాటర్ నాలాలో ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులతో పాటు మెష్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఈ దేవానంద్, జోనల్ కమిషనర్లు, ఎస్ఈలు పాల్గొన్నారు.