సిటీబ్యూరో, జనవరి 21(నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్కు చుట్టూ వాహనాల రద్దీ నియంత్రణ, వాహనదారులు తేలిగ్గా ముందుకు సాగేందుకు వీలుగా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులకు భూ సేకరణ కత్తిమీద సాములా మారింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్టు కింద రూ. 1090 కోట్లతో ఆరు జంక్షన్లలో 8 స్టీల్ బ్రిడ్జిలు, ఆరు అండర్‌పాస్‌ల నిర్మాణానికిగానూ పరిపాలన అనుమతులు మంజూరు చేసి, ఈ పనులకు ఇప్పటికే టెండర్లు పిలవాల్సిన ఇంజనీరింగ్ విభాగం భూ సేకరణ ప్రక్రియ ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నది.
కేబీఆర్ పార్కు చుట్టూ వీవీఐపీలు, వీఐపీలు, రాజకీయ, సీని ప్రముఖుల పెద్దల ఆస్తులు ఉండడం, న్యాయపరమైన చిక్కులు వస్తుండడంతో భూ సేకరణ సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు పనులపై నీలి నీడలు కమ్ముకున్న పరిస్థితుల్లో మూడు జంక్షన్లలో రహదారి విస్తరణకు సంబంధించి టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు తాజాగా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఆర్డీపీ)ని ఖరారు చేశారు. మూడు జంక్షన్లకుగానూ 105 చోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్డీపీ ప్లాన్‌ను గురువారం మేయర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో అధికారులు సభ్యుల ముందు ప్రతిపాదించనున్నారు. సభ్యులు ఈ అంశాన్ని సుదీర్ఘంగా చర్చించి ఆర్డీపీ ప్లాన్‌ను ఆమోదించనున్నారు.
ఇంజనీరింగ్ విభాగం ఆదేశాల ప్రకారం భూ సేకరణ ప్రక్రియను జరపనున్నారు. భూ సేకరణలో భాగంగా మూడు జంక్షన్ల ఆర్డీపీ ప్లాన్ ప్రకారం బసవ తారకం క్యాన్సర్ దవాఖానా జంక్షన్లో 33, 36, 60 మీటర్ల మేరలో రహదారి విస్తరించాల్సి ఉంటుంది. ఇందుకు 18 చోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్లో 33, 45.5, 45 మీటర్లలో రహదారిని విస్తరణలో 47 ఆస్తులు, ముగ్ధ జంక్షన్లో 30, 36 మీటర్ల విస్తరణలో భాగంగా 40 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆర్డీపీ (రోడ్ డెవలప్మెంట్ ప్లాన్)లో ప్రతిపాదించారు.
ప్రముఖుల ఆస్తులకు హెచ్ సిటీ ప్రాజెక్టు గండం
కేబీఆర్ పార్కు చుట్టూ అగ్రసేన్, ఫిలింనగర్, క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం ఇలా ఆరు జంక్షన్లు ఉన్నాయి. ఈ ఆరు జంక్షన్లలో 8 స్టీల్ బ్రిడ్జిలు, ఆరు అండర్‌పాస్‌ల నిర్మాణం జరగనుంది. జూబ్లీహిల్స్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద రెండు చొప్పున నాలుగు స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగతా నాలుగు జంక్షన్ల వద్ద ఒక్కో స్టిల్ బ్రిడ్జి, ఆరు జంక్షన్ల వద్ద ఒక్కొక్కటి చొప్పున ఆరు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి రోడ్డు నెంబరు 45 వైపు వచ్చే ఫ్లై ఓవర్‌పై భాగంలో రెండు లేన్లతో రానుంది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్ 36 వైపు వెల్లే నాలుగు లేన్ల కింద నుంచి వెళ్లనుంది. భూ సేకరణలో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ రహదారి విస్తరణ చేపట్టాల్సి ఉంది.
టీడీపీ కార్యాలయం పక్కన మినహా చుట్టూ రోడ్డుని విస్తరించనున్నారు. వంద ఫీట్ల మేర ఉన్న రోడ్డుని 120 ఫీట్లుగా వైడెనింగ్ చేయనున్నారు. ఈ రహదారి కింద మార్గంలో అండర్‌పాస్‌లు, పైన స్టీల్ బ్రిడ్జిలతో పాటు 120 ఫీట్ల రోడ్డు వస్తుండడంతో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు అవకాశం ఉండదు. రహదారి విస్తరణకు 87 ఆస్తులను సేకరించనున్నారు. బీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా రోడ్డు నంబరు 45 బాలకృష్ణ ఇంటివైపు, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, భారతీయ విద్యా భవన్స్ స్కూల్ వైపు, అగ్రసేన్ చౌరస్తా, బంజారాహిల్స్ రోడ్ నం 12 వైపు ఈ ఫ్లై ఓవర్లను నిర్మించే ప్రతిపాదనలు రూపొందించారు.
ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం డిజైన్లు పూర్తి చేశారు. ఎక్కడెక్కడ పిల్లర్లు నిర్మించాలో ఆ ప్రాంతాల్లో మార్కింగ్ పూర్తి చేశారు. ప్రాథమికంగా భూ పరీక్షలు పూర్తయిన తర్వాత పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుడతారు. ఐతే ఈ భూసేకరణలో మాజీ మంత్రి జానారెడ్డితో పాటు సినీహిరో ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణలకు చెందిన ఆస్తులకి సంబందించి కూడా కొంత మేర స్థలం సేకరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఓ దఫా మార్కింగ్ కూడా జరగడం..ఈ ఇద్దరు ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారన్న అధికారుల వాదన. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు వివాస్పదానికి కేంద్ర బిందువుగా మారనుందనే ప్రచారం ఉంది.
రేపు స్టాండింగ్ కమిటీ సమావేశం
మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం గురువారం జరగనుంది. ఈ సమావేశంలో ఎజెండాలోని 15 అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. ప్రధానంగా కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆర్డీపీ ప్లాన్ ఆమోదం, కేబీఆర్ప పార్కు హెచ్ సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపును ఆమోదించనున్నారు. నారాయణగూడలో మల్టీ మోడల్ మార్కెట్ , ఇతర హెచ్ సిటీ ప్రాజెక్టులకు 227 చోట్ల ఆస్తుల స్వాధీనం, సీఆర్ఎస్ పద్దతిలో పలు అభివృద్ధి పనులు, నాలా పూడిక తీత పనులు, సీఆర్ఎంపీ పథకం పనుల ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.