సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): పునర్వ్యవస్థీకరణతో హైదరాబాద్ పోలీసు విభాగం ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నాలుగు కమిషనరేట్లుగా విభజనతో పాటు పోలీసు జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లోనూ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్‌ను ఏడు జోన్లుగా మార్చడంతో పాటు ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం కొత్తగా సౌత్, నార్త్‌గా రెండు పోలీస్రేంజ్లను ఏర్పాటు చేసింది. కమిషనరేట్ విస్తృతి పెరగడంతో పాటు సిటీ పోలీసింగ్‌లో భాగంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లతో కలిపి సౌత్ రేంజ్ ఏర్పాటు కాగా జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లతో నార్త్ రేంజ్ ఏర్పాటైంది.
ఈ నేపథ్యంలో కొత్త సబ్డివిజన్లలో ఏసీపీల నియామకానికి ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే నాలుగు కమిషనరేట్ల పరిధిలో 20 మంది డీసీపీలను నియమించగా పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవసస్థీకరణతో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల ఏసీపీ సబ్ డివిజన్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నాలుగు కమిషనరేట్లలో పలు కొత్త డివిజన్లు ఏర్పాటవడంతోపాటు పోలీస్స్టేషన్ల పరిధి మారడం, కొన్ని సబ్ డివిజన్లు ఒక కమిషనరేట్ నుంచి మరొక కమిషనరేట్‌కు మారాయి. ఈ నేపథ్యంలో ఏసీపీల బదిలీలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. మొత్తం నాలుగు కమిషనరేట్ల పరిధిలో 100 మందికి పైగా ఏసీపీల బదిలీలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఒకట్రెండురోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. అయితే గతంలో హైదరాబాద్‌లో పనిచేసిన అధికారులకు పోస్టింగులలో ప్రాధాన్యం దక్కనున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు.
ఏళ్లుగా పాతుకుపోయారు..
సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని జోన్లలో కొందరు ఏసీపీలుగా ఏళ్లుగా పాతుకుపోయారు. దీంతో ఆ ప్రాంతంలో అన్ని అక్రమదందాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై వారికి వాటా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కొందరైతే అదే జోన్లో ఎస్ఐలు, సీఐలు, డీఐలుగా చేసి.. ఏసీపీలు, అడిషనల్ డీసీపీలుగా ప్రమోషన్ పొందారు. ఇన్ని ప్రమోషన్లు వచ్చినా జోన్ మారకుండా వారు అక్కడే పాతుకుపోయి స్థానిక ప్రజాప్రతినిధులు, తమ గాడ్ఫాదర్ల సహకారంతో ఆ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పాతబస్తీలోని మలక్‌పేట, మీర్‌చౌక్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలతోపాటు బహదూర్‌పుర, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా, బండ్లగూడలో పోలీసు అధికారులు అక్కడే తిష్టవేసుకుని ఉంటున్నారు.
ఒకవేళ బదిలీలు జరిగినా జోన్లు మారకుండా అదే జోన్‌లోనో లేదా పక్కనే ఉన్న జోన్లోకి మారుతున్నారు తప్ప ఇప్పటివరకు సౌత్, సౌత్ఈస్ట్, సౌత్ వెస్ట్ వదిలేసి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక సెంట్రల్‌జోన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఏసీపీలు, ఈస్ట్‌లో ఒకరు, నార్త్‌లో ఒకరు తమ సీటును వదిలిపెట్టకుండా అదేచోట ఏళ్లుగా ఉంటున్నారు. ఒకవేళ అవసరమైతే పక్క డివిజన్‌కు వెళ్తున్నారు తప్ప జోన్ దాటి బయటకు రావడంలేదని డిపార్ట్మెంట్లో టాక్. అలాగే చాలా జోన్లలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లదీ ఇదే పంథా కొనసాగుతోంది. కొందరు ఇన్స్పెక్టర్లు డివిజన్ మారకుండానే స్టేషన్లు మార్చుకుంటూ తమ దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు నచ్చిన ఏసీపీ పరిధిలో పనిచేస్తానంటూ కొందరు ఇన్స్పెక్టర్లు వారిని ఆ డివిజన్‌కు రప్పించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పైరవీలు చేయిస్తున్నారని సమాచారం.
జోరుగా పైరవీలు..!
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి విస్తృతంగా పెరగడంతో ఇప్పుడు ఏసీపీల బదిలీలు కీలక అంశంగా మారాయి. మరోవైపు కమిషనరేట్‌లోని తమ ప్రాంతంలోని అన్ని పోలీస్ స్టేషన్లు ఒక డివిజన్ పరిధిలోనే వచ్చేలా ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలగకుండా పాలనాసౌలభ్యం కోసం పోలీసుశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి మళ్లీ తామే పోస్టింగ్ తెచ్చుకుంటే పాత దందాలు కొనసాగించే అవకాశముంటుంది కాబట్టి కొందరు అధికారులు లాబీయింగ్ మొదలుపెట్టారు.
ఈ విషయంలో సౌత్, నార్త్, సెంట్రల్ జోన్లలో కొందరు ఆఫీసర్లు ఇప్పటికే తమ పోస్టింగ్ ఇక్కడికేనంటూ దగ్గరివారితో చెప్పుకుంటున్నట్లు తెలిసింది. వివిధ ఆరోపణలతో పాటు కొన్నేళ్లుగా అదే జోన్లో పనిచేస్తున్నవారిని ఇప్పుడు వేరేదగ్గరికి మారిస్తే పోలీసింగ్‌లో మెరుగైన ఫలితాలు చూడవచ్చని ఓ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. కానీ ఆ పరిస్థితి ఉంటుందా అనే అనుమానం ఉందని, ఇప్పటివరకు వారిని ఎవరూ కదిలించలేకపోయారని, తమకు సంబంధించిన ముఖ్య ఆఫీసర్లతో చేస్తున్న లాబీయింగే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు తాము ఫోకల్ పోస్టులోకి వస్తే తమకు కావలసినంత దండుకోవచ్చని, అవసరమైతే లోకల్‌గా తమకు సహకరించినవారికి సంపాదించిపెట్టడానికి అవసరమైన తోడ్పాటునందిస్తామంటూ ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పోలీసు శాఖలో చర్చించుకుంటున్నారు.