సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): నగరంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు నిర్వహించిన ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ నెల 28న నిర్వహించాల్సిన ఈ ర్యాలీ, వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆదివారం మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది యువకులు బైకులు, కార్లతో పాటు ప్రధాన కూడళ్లలో నడుచుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ర్యాలీని సీసీ కెమెరాల ద్వారా బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పరిశీలించారు. డ్రోన్ కెమెరాలతో ర్యాలీపై నిఘా పెట్టి పరిశీలించారు. ప్రధాన ర్యాలీ ఖాద్రీ చమాన్ నుంచి బయలుదేరి మధ్యా హ్నం చార్మినార్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ర్యాలీని సీపీ సీవీ ఆనంద్, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ అదనపు సీపీ సుదీర్‌బాబు, అదనపు సీపీ (ఎస్బీ) విశ్వప్రసాద్, సౌత్‌జోన్ డీసీపీ సాయి చైతన్యతో కలిసి పరిశీలిస్తూ నిర్వాహకులను కలిశారు. ప్రధాన కూడళ్లలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు.
సమన్వయంతో ప్రశాంతత
సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): వినాయక నవరాత్రులు, నిమజ్జనంతో పాటు మిలాద్ ఉన్ నబీ పండుగలు హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. 35 ఏండ్ల తర్వాత ఒకేరోజు నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలు వచ్చాయి. ఒకేరోజు రెండు మతాలకు సంబంధించిన వేడుకలు నిర్వహించడంపై మొదట్లో కొంత ఆందోళన చెందారు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని పోలీసులు అందరిని సమన్వయం చేశారు. ఇందులో భాగంగానే ముస్లిం మత పెద్దలతో చర్చించి, వాస్తవ పరిస్థితిని వివరించడంతో సెప్టెంబర్ 28వ తేదీ నుంచి తమ ర్యాలీని అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీంతో 28న గణేశ్ నిమజ్జనాన్ని భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ఈసారి విగ్రహాల సంఖ్య పెరగడంతో రెండు రోజుల పాటు నిమజ్జనం కొనసాగింది. దీంతో 48 గంటల పాటు పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.
ఒకరికొకరు.. కలిసి మెలిసి
హైదరాబాద్ భిన్న సంస్కృతులకు నిలయం. భిన్న మతాలకు చెందిన వారు నివాసముంటారు. ఒకరి పండుగలను మరొకరు గౌరవించుకుంటూ.. నగర ప్రజలు కలిసి మెలిసి ఉంటారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పోలీసులు కూడా ప్రజలతో కలిసిపోయి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు. పటిష్టమైన శాంతి భద్రతల నిర్వహణతో ప్రజలకు మేమున్నామనే పూర్తి భరోసానిస్తున్నారు.