సమీపంలోనే లోటస్ పాండ్.. త్వరలోనే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను అనుసంధానం చేసే 80 ఫీట్ల రోడ్దు.. అంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లు.. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ సంస్థలు తాము చేపట్టనున్న ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్ అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్లే.. సుమారు 30 ఏండ్ల పాటు కబ్జాదారులతో న్యాయపోరాటాల అనంతరం గత ప్రభుత్వాలు, రెవెన్యూ అధికారులు తీవ్రంగా శ్రమించి నగరం నడిబొడ్డున కాపాడిన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని వేలంపాట వేసి అమ్మేసే ప్రయత్నాల్లో భాగంగా హెచ్ఎండీఏ రూపొందించిన ప్రకటన ఇది.
– బంజారాహిల్స్, జూన్ 10
ప్రజా ప్రయోజనాల కోసమే ఈ స్థలాన్ని వినియోగిస్తాం..’ అంటూ ఏడాది క్రితం మీడియా సాక్షిగా ప్రకటనలు గుప్పించిన హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్సిన మాటలను తుంగలో తొక్కిన హెచ్ఎండీఏ బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉన్న 8.24 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రీబి డ్ మీటింగ్ జూన్ 12న నిర్వహించనుంది. ఈ స్థలానికి ఎకరం రూ. 99 కోట్ల కనీస ధర ను నిర్ణయించినట్లు హెచ్ఎండీఏ ప్రకటనలో పేర్కొంది. షేక్‌పేట మండలంలోకి వచ్చే హకీంపేట విలేజ్ పరిధిలోని సర్వే నెంబర్ 102/1, టీఎస్ 1/పీ, 3/పీ, బ్లాక్-జే, వార్డు 12తో పాటు పక్కనున్న మరికొన్ని సర్వేనెంబర్లలో సుమారు 26ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది.
బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలాలపై న్యాయస్థానాల్లో వివాదాలు ఉండగా, గత ప్రభుత్వాల వాదనలతో సుమారు 10ఎకరాల్లో వివాదాలు సమసిపోయాయి. కాగా పక్కను న్న ఎమ్మెల్యే కాలనీలోని శ్రీ వెంకటేశ్వర హౌస్ బిల్డింగ్ సొసైటీ లే అవుట్‌లోని కొన్ని ఇండ్ల యజమానులు ఈ స్థలంలో కొంతభాగాన్ని స్ట్రేబిట్స్గా పేర్కొంటూ సొసైటీ నుంచి కొనుగోలు చేశారు. వారిలో కొన్ని ఆక్రమణలను ఏడాది క్రితం షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది తొలగించడంతో పాటు సుమారు 10ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు.

ఈ స్థలంలో అరుదైన వృక్షాలు, కొండరాళ్లు ఉండడంతో పచ్చదనంతో కళకళలాడుతుండడంతో దీన్ని థీమ్ పార్కుగా అభివృద్ధి చేయాలంటూ ఎమ్మెల్యే కాలనీవాసులు, స్థానికులు కోరడంతో స్థలాన్ని సందర్శించిన జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టితో సహా ఇతర అధికారులు దీన్ని హెచ్ఎండీఏకు అప్పగించి అద్భుతమైన థీమ్ పార్కు గా మారుస్తామని ప్రకటించారు.
అయితే ఆరునెలల్లోనే ప్రభుత్వ పెద్దలు ఈ స్థలం విషయంలో అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతూ ప్రభుత్వానికి ఆదాయం కావాలంటూ ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉన్న 8.24 ఎకరాల స్థలాన్ని వేలంపాట ద్వారా అమ్మాలని నిర్ణయించడంతో పాటు 20రోజుల క్రితమే ఆన్లైన్లో వేలంపాటకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ ద్వారా కనీస ధరను రూ.99కోట్లుగా నిర్ధారించారు. బిడ్‌లో పాలొ ్గనే వారు ఈనెల 12లోగా ఎకరానికి రూ.5కోట్ల చొప్పున ఈఎండీ మొత్తాన్ని చెల్లించాలని, జూన్ 19న వేలంపాట ఉంటుందని ప్రకటించారు.

దీనికి తోడు ఈ స్థలంలో సుమా రు 4దశాబ్దాలుగా పెద్దమ్మతల్లి గుడి ఉందని, దాన్ని ఏడాది క్రితం రెవెన్యూ అధికారులు తొలగించారని స్థానికులు ఆందోళనలు చేపట్టారు. ఈ స్థలాన్ని వేలం వేస్తున్నట్లు తెలుసుకున్న హైందవ సంఘాలు, స్థానికులు మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో వారిపై కేసు నమోదైంది. ఈ స్థలాలను వేలంవేసి అమ్మేందుకు ఎట్టిపరిస్థితిలో తాము ఒప్పుకునేది లేదంటూ ఇప్పటికే వారు హెచ్చరికలు జారీ చేశారు.