తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అమ్మకాలు లేక మందగమనంలో ఉంటే.. ప్రభుత్వం అనాలోచితంగా మార్కెట్ విలువలను పెంచి ఈ రంగంపై గొడ్డలి వేటు వేసిందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ విలువల పెంపుతో సామాన్య కొనుగోలుదారులపై పెనుభారం పడుతోందని, దీనిని అధిగమించాలంటే వెంటనే స్టాంప్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్ చేశారు.
భూముల విలువ పెంపును వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్ విలువలు పెరగడం వల్ల కేవలం రిజిస్ట్రేషన్ చార్జీలే కాకుండా ఎల్ఆర్ఎస్ చార్జీలు, పర్మిషన్ ఫీజులు కూడా భారీగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు చేనగచర్ల, పర్వతాపూర్, నారపల్లి వంటి ప్రాంతాల్లో గతంలో రూ.5,300లుగా ఉన్న మార్కెట్ విలువను ఏకంగా రూ. 9,300కి పెంచారని గుర్తు చేశారు. ఈ విధంగా ఒకేసారి 60 శాతం విలువను పెంచడం వల్ల సామాన్యుడు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడిందని ప్రవీణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం 7.5 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలను మూడు శాతానికి తగ్గించి కొనుగోలుదారులను ఆదుకోవాలని కోరారు.
– సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ)
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కనీస అవగాహన లేదని ప్రవీణ్ విమర్శించారు. అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలో పెట్టాల్సింది పోయి అన్ని రకాల క్లియర్ టైటిళ్లు, అనుమతులు ఉన్న ప్రైవేట్ ప్లాట్లను, ఇండ్లను కూడా ఆ లిస్ట్‌లో పెట్టి బాధితులను ఆఫీసుల చుట్టూ తిప్పుకొంటున్నారని మండిపడ్డారు.
అనేకసార్లు రిజిస్ట్రేషన్లు అయిన భూములు కూడా ప్రభుత్వ సర్వే నంబర్లలో లేవని, ప్రైవేట్ సర్వే నంబర్లని మొత్తుకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, అత్యవసర వైద్య ఖర్చులకు తమకున్న ప్ల్లాట్లను అమ్ముకుందామనుకుంటే వాటిని ప్రభుత్వ భూములు అంటూ.. కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారని ప్రవీణ్ విమర్శించారు.
ఒక సర్వే నంబరులో 50 ఎకరాల భూమి ఉండి అందులో కేవలం ఒక ఎకరం మాత్రమే ప్రభుత్వ భూమి అయితే మిగతా 49 ఎకరాల ప్రైవేట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను కూడా నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఒక్క ఎకరం ఎక్కడుందో తమకు తెలియదనే సాకుతో రిజిస్ట్రేషన్ అధికారులు మొత్తం భూమిని నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖల సమన్వయంతో వ్యవహరించి, ఈ అస్తవ్యస్త విధానానికి స్వస్తి పలికి తక్షణ పరిష్కారం చూపాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరపున ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.