సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ఆరు జోన్ల పరిధి నుంచి మొత్తం 188 దరఖాస్తులు వచ్చాయి. కమిషనర్ ఫోన్ ఇన్ ద్వారా 18 కాల్స్ తీసుకున్నారు. ప్రధాన కార్యాలయంలో 56 ఫిర్యాదులు, జోనల్, సర్కిల్ కార్యాలయాలు కలిపి 132 ఫిర్యాదులు వచ్చాయి. అధికంగా టౌన్‌ప్లానింగ్ సంబంధించినవే ఎక్కువగా వచ్చాయి. ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని మేయర్, కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేసి మెసేజ్ అర్జీదారునితో పాటు సంబంధిత శాఖ హెచ్‌వోడీకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే పరిష్కరించిన వాటి నివేదికను శనివారం లోపు అందజేయాలని మేయర్ కోరారు. అలాగే ప్రజావాణి ఫిర్యాదులు ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో ఆర్జీదారునికి లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కమిషనర్ చెప్పారు. సర్కిల్ జోనల్ స్థాయిలో సమస్య పరిష్కారం జరగని వారు మాత్రమే హెడ్ ఆఫీస్‌కు రావాలని, ఒకే సమస్యపై రెండోసారి అర్జీ సమర్పిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.