సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల సమస్యలను అడుగుతూ అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంపై ఆయా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
ప్రజావాణి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా మూడు విన్నపాలు రాగా, పరిష్కారానికై ఆయా విభాగాలకు పంపించారు. ప్రధాన కార్యాలయంలో 46 విన్నపాలు రాగా, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 21, ఎఫ్ఏ హెల్త్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగానికి 4, స్పోర్ట్స్, సీఈ మెయింటనెన్స్, ఎస్టేట్, ఎల్డబ్ల్యూస్, హౌసింగ్ విభాగాలకు రెండు చొప్పున, విజిలెన్స్ విభాగానికి ఒక్క ఫిర్యాదును స్వీకరించారు. ఇక ఆరు జోన్లలో 80 అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. కూకట్పల్లి జోన్లో 33, శేరిలింగంపల్లిలో 9, ఎల్బీనగర్లో 14, సికింద్రాబాద్‌లో 21, చార్మినార్‌లో మూడు, ఖైరతాబాద్‌లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు.