Congress Govt | సిటీ బ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం తీరుతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. తమ నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లు ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో తికమకపడుతున్నారు. దరఖాస్తును అధికారులు పరిగణనలోకి తీసుకున్నారో లేదోనని మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నామని చెబుతున్నారు. మరోవైపు వార్డుల్లోకి అధికారులు ఎప్పుడు వస్తారనే సమాచారం సైతం లేకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు అందజేస్తున్నామని అంటున్నారు.
దీంతో సోమవారం వచ్చిందంటే ప్రాంగణమంతా దరఖాస్తు దారులతో కిటకిటలాడుతోంది. నగరం నలుమూలల నుంచి దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలు సైతం వచ్చి దరఖాస్తు ఫారాలను అధికారులకు అందజేస్తున్నారు. అధికారులు మాత్రం అర్జీలు తీసుకోవడమే కానీ వారికి ఎలాంటి రసీదులు ఇవ్వడంలేదని చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్నాక వెబ్సైట్లో చెక్ చేసుకోగా ‘డేటా నాట్ ఫౌండ్’ (సమాచారం అందుబాటులో లేదు) అని వస్తుందంటూ వాపోతున్నారు. దీంతో మరోసారి కలెక్టరేట్‌కు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నామని తెలియజేస్తున్నారు. ప్రజావాణి దరఖాస్తులు మధ్యాహ్నం ఒంటి గంట వరకే తీసుకోవడంతో చాలా మంది వెనుదిరిగిపోతున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ జిల్లా ప్రజలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. ఏడాది కాలంగా ఇప్పటి వరకు ఐదారుసార్లు అర్జీలను అధికారులకు ఇచ్చామని ప్రజావాణికి వచ్చినవారు చెబుతున్నారు. తొలుత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే లిస్టులో తమ పేర్లు రాలేదని అంటున్నారు. ఎందుకు లేదని అడిగితే తమకేమీ తెలియదని ‘మీసేవా’ నిర్వాహకులు సమాధానమిస్తున్నారని అంటున్నారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో అర్జీ పెట్టకున్నా లిస్టులో పేరు రాలేదని వాపోతున్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అన్ని అర్హతలున్నా తమ పేర్లు లిస్టులో రాకపోవడమేంటని ఆందోళన చెందుతున్నారు.చేసేదేమీ లేక కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో మరోసారి అర్జీలు ఇస్తున్నామని నిట్టూరుస్తున్నారు.దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం అర్హులను గుర్తించి సంబంధిత వెబ్సైట్లలో పేర్లను నమోదు చేయడంలో విఫలమవుతోంది. అర్జీలను తీసుకోవడానికే పరిమితమవ్వడంతో ప్రజలు తికమకకు గురవుతున్నారు.
ప్రజావాణికి 1561 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్లు కదిరవన్ పలాని, ముకుందరెడ్డి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల్లో డిస్టిక్ట్ సివిల్ సప్లై 743, గృహ నిర్మాణ శాఖ 735, పింఛన్లకు 55, డీఈవో 4తో పాటు ఇతర శాఖలకు సంబంధించి 24 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, జిల్లా అధికారులు ఆర్ రోహిణి, పవన్ కుమార్, కోటాజీ, డీఎంహెచ్‌వో వెంకటి తదితరులు పాల్గొన్నారు.
నాకు తల్లిదండ్రులు లేరు. భార్య, రెండేండ్ల కుమారుడితో అద్దె ఇంట్లో ఉంటున్నా. రూ.13వేల జీతానికి ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నా. నాకొచ్చి కొద్దిపాటి జీతం ఇంటి అద్దెకే సరిపోవడంలేదు. ఇందిరమ్మ ఇంటి కోసం ఇప్పటికీ మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటిదాకా లిస్టులో నాపేరు రాలేదు. ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అన్ని అర్హతలున్నా నాపేరు లిస్టులో ఎందుకు రావడంలేదో అర్థం కావడంలేదు. నేను, నా భార్య చిన్న పిల్లాడిని తీసుకుని కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నాపేరు వచ్చేలా చూడాలని కోరుతున్నా.
-పొన్నాల యోగేష్, ఆసిఫ్ నగర్