జనగామ, యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) ; జనగామ, భువనగిరిలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అంచనాలకు మించి జనం తరలిరావడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపించింది. కాంగ్రెస్ను తూర్పారబడుతూ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసింది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తున్నప్పుడు భారీగా స్పందన వచ్చింది. ప్రతి అంశాన్ని వివరిస్తున్నప్పుడు జనం చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన నష్టాన్ని, ఆ పార్టీ వల్ల ముందున్న ప్రమాదాన్ని వివరించిన సీఎం కేసీఆర్.. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అద్భుత ప్రగతిని కండ్లకు కట్టారు. అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. రైతుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పడకముందు వారు పడిన తిప్పలను వివరించారు. తాను కూడా రైతు బిడ్డనేనంటూ.. రైతుల బాధలు తనకు తెలుసని చెప్పారు. ధరణి ద్వారా అన్నదాతల కష్టాలు తొలిగిపోయాయని పేర్కొన్నారు. దేశంలోనే 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ధరణిని తీసేస్తామంటూ.. అన్నదాతలకు మూడు గంటల కరెంటు చాలని అనేటోళ్లకు బుద్ధి చెప్పాలన్నారు.