సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపిలేని వర్షాలతో నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో గంటల తరబడి అంతరాయమేర్పడుతోంది. చాలాచోట్ల వర్షం పడటానికి ముందే ఈ సమస్య వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. కొన్నిచోట్ల ఈదురుగాలులతో విద్యుత్ తీగలు చెట్లకొమ్మలకు తగిలి ట్రిప్పవుతున్నాయని.. వాటిని పునరుద్ధ్దరించే క్రమంలో కొంత ఆలస్యం జరుగుతోందని సిబ్బంది తెలుపుతున్నారు. అయితే ప్రధానంగా చోర్ఫాల్ట్ అనేది తరచుగా ఏర్పడుతున్న సమస్య అని, ఈనేపథ్యంలో కొన్నిసార్లు సమస్యను గుర్తించేందుకు చాలా సమయం పడుతోందని విద్యుత్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా కొన్ని గంటల పాటు నిలిచిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి సందర్శనల్లో డిస్కం అధికారులకు ప్రజల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
చోర్ఫాల్ట్ దొరకడం లేదు..
వానాకాలంలో ఇన్సులేటర్ వద్ద తలెత్తే నోవిజిబుల్ ఫాల్ట్ (చోర్ఫాల్ట్) సమస్య కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఒక్కో ఫీడర్ పరిధిలో 5-8 కిలోమీటర్ల వరకు ఎక్కడో ఒక దగ్గర ఈ చోర్ఫాల్ట్ ఏర్పడుతుంది. అలా కావడానికి కారణాలు వెతకడంలో కొంత ఆలస్యమవుతుంది. కొన్నిచోట్ల ట్రిప్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తే మళ్లీ సైప్లె మొదలవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో స్టార్ట్ చేసిన వెంటనే మళ్లీ ట్రిప్ అయితే ఆ ఫాల్ట్‌ను కనుక్కోడానికి క్షేత్రస్థాయి సిబ్బంది.. ఇబ్బంది ఉన్న ప్రాంతాన్ని వెతికే క్రమంలో సరఫరా ఆలస్యమవుతోంది.
వర్షాలకు కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు పడిపోవడం వలన ట్రిప్ అయిన వాటిని పునరుద్ధరిస్తున్నప్పటికీ మరికొన్నిచోట్ల ఏదో ఒక గుర్తుతెలియని వస్తువు, జీవి వల్ల ట్రిప్ అయితే వాటిని కనిపెట్టి పునరుద్దరించడంలో జరిగే ఆలస్యంపై ఫిర్యాదులు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. మరోవైపు ఎండాకాలం నుంచి వానాకాలానికి మారే క్రమంలో ఇన్సులేటర్ అంబ్రల్లా వద్ద కానీ, మాండ్రెల్ వద్ద కానీ పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో ట్రిప్పయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం వర్షాలతో ఈ సమస్యను అధిగమించినా చాలాచోట్ల ఇన్సులేటర్లలో లోపాలు తలెత్తుతున్నాయని వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని విద్యుత్ అధికారులు చెప్పారు.
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు..
నగరంలో వారం రోజులుగా వర్షం కురుస్తున్నా విద్యుత్ డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంది. గత సంవత్సరం కంటే ఈసారి 8 నుంచి 30శాతం వరకు అధికంగా విద్యుత్ వినియోగం, డిమాండ్ నమోదవుతోందని అధికారులు చెప్పారు. పరిశ్రమలు, వాణిజ్య, గృహ సముదాయాలు పెరుగుతుండటంతో పాటు ఈవీ చార్జింగ్ స్టేషన్ల వంటి వాటితో హైదరాబాద్ చుట్టూ డిమాండ్ విపరీతంగా పెరిగింది. క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో వస్తున్న సమస్యలపై అధికారులు ప్రజల వద్దకు వెళ్తున్న క్రమంలో వారికి ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ లైన్ల సమస్యను వినియోగదారులు వారి దృష్టికి తీసుకువస్తున్నారు.
బంజారాహిల్స్, జూబ్ల్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో సీఎండీ ముషారఫ్ ఫరూఖి పర్యటించినప్పుడు ఆయనకు పలువురు స్థానికులు తమ ఇళ్లపైనుంచి పోతున్న హైటెన్షన్ వైర్‌ను చూపించి వాటిని మార్చాలని కోరారు. అంతేకాకుండా మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతిని ఉండటం, ఒకవైపు ఒరిగి ఉండటడం, కొన్నిచోట్ల ఇళ్లకు తగిలి ఉండటంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్లకు తోడుగా మరో సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలం గురించి కూడా సీఎండీతో స్థానికులు, అధికారులు చర్చించారు. ఇలా ప్రతీచోట క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన అధికారులకు ప్రజలనుంచి ఫిర్యాదులు వస్తుండగా వాటిని పరిష్కరించడానికి అనుకూలతను బట్టి అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు.